శివరాత్రి రోజున బయట పడిన శివలింగం

మహా శివరాత్రి రోజున మహా శివుడు శివలింగంగా ఉద్భవించాడని పురాణాల్లో చెబుతుంటారు.

Update: 2024-03-08 12:17 GMT

దిశ, గరిడేపల్లి : మహా శివరాత్రి రోజున మహా శివుడు శివలింగంగా ఉద్భవించాడని పురాణాల్లో చెబుతుంటారు. కానీ నిజంగా మహా శివరాత్రి రోజున శివలింగం వెలసిన సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని సర్వారం గ్రామ శివారులో ఉన్న నల్లగుట్ట వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పగిడి దుర్గయ్య - కోటమ్మల కుమారుడు పగిడి గోపి (26) 12 సంవత్సరాల నుంచి మాంసాహారాలు మానేసి శివ పూజ చేస్తున్నాడు. కాగా అతనికి నాలుగు సంవత్సరాల క్రితం నుంచి శివుడు కలలో కనిపించి గుట్ట మీద వెలిశానని చెబుతుండటంతో గోపి తన తల్లితండ్రులను అడగగా మన గ్రామం పక్కన ఉన్న లింగగిరిలో ఐతే శివుడు, నరసింహ స్వామి ఆలయాలు ఉన్నాయని అన్నారు.

దీంతో గోపి తనేమీ పట్టించుకోకపోవడంతో ఒళ్ళు, కాళ్ళ మంటలు వస్తుండటంతో సూర్యాపేట ప్రక్కన గల ఓ గ్రామానికి చెందిన గంగమ్మ దేవాలయంలో అడిగి చూడగా ఇదంతా శివుని మాయ అని, మీ గ్రామ సమీపంలోని గుట్ట వద్ద వెలిశానని చెప్పారు. దానికి గోపి బదులిస్తూ నేను చదువుకున్నావాడినని, నేను ఇప్పుడు వెలికితీస్తే ఇతనికి ఉద్యోగం లేక ఇలాంటివి చేస్తున్నాడని ప్రజలు చర్చించుకుంటారని, నాకు ఏదైనా ఉద్యోగం వస్తే మీ వెలసిన దగ్గరకు వచ్చి మిమ్మల్ని వెలికితీస్తానని చెప్పాడు. కాగా ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాలలో టీజీటీ ఉద్యోగం వచ్చింది. గురువారం ఉదయం నుంచి గోపి జ్వరంతో బాధపడుతూ పడుకోగా కలలో మధ్యాహ్నం సమయంలో ఆవు నా మీద దూకుతున్నట్లు, నీకు తినడానికి అన్ని ఇచ్చాను నాకేమి ఇవ్వవా అని అడగడంతో నాకు జ్వరం తగ్గి మంచిగా ఐతే మీ వెలసిన దగ్గరకు వస్తా అని మనసులో మొక్కుకొని పడుకున్నాడు. ఉదయం వరకు జ్వరం తగ్గడంతో ఆ గుట్ట వైపు వెళ్లి చూడగా సూర్యకిరణాలు చెట్ల మధ్య నుంచి బండ క్రింద పడుతుండంతో అక్కడకు వెళ్లి చూడగా ఆ ప్రాంతంలో నల్లగా వస్తువు కనిపించింది.

ఇది ఏంటి అని బండ క్రింద ఉన్న పుట్టను కొంత పెకిలించి చూడగా శివలింగం బయటపడింది. వెంటనే గోపి దాన్ని ఫోటో తీసి సర్వారం గ్రామంలోని కొంత మందికి, గ్రామ పూజారికి, కీతవారిగూడెం గ్రామ సచివాలయం పూజారికి పంపగా అది బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగం అని తెలిపారన్నారు. కాగా మహా శివరాత్రి రోజున శివలింగం వెలసిన విషయం తెలియడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు.


Similar News