Recruitment : పెద్దగట్టు లింగన్న కుశలమా..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అతిపెద్ద జాతర ఏదైనా ఉంది అంటే అది సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న దురాజ్ పల్లి శ్రీ లింగమంతుల జాతర అని ప్రతి ఒక్కరికి తెలుసు.

Update: 2024-10-29 09:07 GMT

దిశ, సూర్యాపేట టౌన్ : ఉమ్మడి నల్గొండ జిల్లాలో అతిపెద్ద జాతర ఏదైనా ఉంది అంటే అది సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న దురాజ్ పల్లి శ్రీ లింగమంతుల జాతర అని ప్రతి ఒక్కరికి తెలుసు. రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించే శ్రీ లింగమంతుల జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారు. రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అతి ఎక్కువమంది హజరై దురాజ్ పల్లి శ్రీ లింగమంతుల స్వామిని దర్శించుకుంటారు.

ప్రతి రెండేళ్ల ఒక్కసారి నిర్వహించే ఈ జాతరకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. భక్తులు దేవాలయంలో వేసే కానుకలతో పాటుగా జాతర నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇంతటి ప్రతిష్ఠ కల్గిన దేవాలయానికి ఆ దేవాలయ ఈవో అప్రతిష్ఠ తీసుకుని వస్తున్నాడు. జాతరల ద్వారా దేవాలయానికి వచ్చిన ఆదాయ లెక్కలు, ఖర్చులు చూపాలంటూ సూర్యాపేట చెందిన ఒక వ్యక్తి దేవాలయ ఈవోకు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా, లెక్కలు చూపడంలో దేవాలయ ఈవో మీనమేషాలు లెక్కపెడుతున్నాడు. జాతరల వచ్చిన ఆదాయం, వ్యయ వివరాలు సహితం మాకు కూడా చూపడం లేదని దేవాలయ పాలకవర్గం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

ఇక్కడే తిష్ట..

శ్రీ లింగమంతుల స్వామి దేవాలయం ఈవోగా కుశలయ్య నియామకం అయ్యి ఏండ్లు గడుస్తున్నా, అతడు మాత్రం ఇక్కడి నుంచి బదిలీ కావడం లేదు. జాతర ఆదాయం, వ్యయ లెక్కలు చూపాలని దేవాలయ పాలకవర్గం పలుమార్లు కోరిన ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. దేవాలయ ఉద్యోగులను అడ్డదారిలో నియామకం చేసుకొని, వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2015 నుంచి నేటి వరకు సుమారుగా ఐదు జాతరలకు పైగా జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే ఈ దేవాలయం ఈవోగా కొనసాగుతుండటం గమనార్హం. 2023 లో నిర్వహించిన జాతర సమయంలో సిబ్బంది కొరత ఉందని ప్రభుత్వానికి సాకు చూపి దొడ్డిదారిలో ఇద్దరు అటెండర్లు, మరో ఇద్దరు స్వీపర్లుగా నియామకం చేసుకున్నాడు. దేవాలయంలో పనిచేయడానికి ఉద్యోగుల కొరకు కలెక్టర్ కార్యాలయం నుంచి బహిరంగ ప్రకటన వేయాల్సి ఉంటుంది. అలాంటి ఏమి లేకుండా ఈవో నే స్వయంగా ఉద్యోగులను నియామకం చేసుకున్నాడని బహిరంగ విమర్శలు వెళ్లువెత్తూతున్నాయి. ఒక్కొక్క ఉద్యోగానికి లక్ష రూపాయల చొప్పున వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే నియామకం అయిన ఉద్యోగులు తాత్కలికంగా జాతర వరకే నియామకం చేసుకోవాల్సి ఉండగా, వారిని నేటికి ఆ ఉద్యోగాలలో కొనసాగడం వెనుక ఈవో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జాతర ముంగిచిన నాటి నుంచి నేటి వరకు ప్రతి నెల జీతాలు చెల్లిస్తుండటం గమనార్హం.

ఈవో సంబంధికులకే..

జాతర సమయంలో ధూపదీప నైవేథ్యం, కొబ్బరికాయల విక్రయం, మిఠాయి విక్రయం, వంటి నిర్వహణను ఈవోకు అనుకూలమైన వ్యక్తులకు వేలం కట్టబెట్టి లక్షల రూపాయలు అక్రమ మార్గంలో పొందాడని ఆరోపణలు ఉన్నాయి. లింగమంతుల స్వామి గట్టు పై ఉన్న నాగ సాయిబాబా దేవాలయంలో ధూపదీప నైవేథ్యం ఏర్పాటు చేయిస్తానని కొంతమంది భక్తుల నుంచి రూ. 50 వేలకు పైగా విరాళం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

దండు మైసమ్మను వదలని ఘనుడు..

ఆత్మకూర్(ఎస్), నెమ్మికల్ గ్రామంలో వెలసిన శ్రీ దండు మైసమ్మ దేవాలయానికి శాశ్వత ఈవోగా పనిచేస్తున్న సమయంలో కొంత మంది భక్తులు దేవాలయం అభివృద్ధి, భాగస్వాములు కావడం కొరకు దేవాలయానికి భక్తులు తయారు చేసిన గ్రిల్ గేట్ ను అమర్చకుండా అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా పెద్దగట్టు లింగమంతుల స్వామి దేవాలయానికి తీసుకువచ్చి, అమర్చి అక్రమ మార్గంలో బిల్లులు పెట్టుకున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటుగా దేవాలయానికి భక్తులు హుండీలో వేసిన కానుకులను సహితం అక్రమమార్గంలో పక్కదోవ పట్టించడంలో ఈవో ఘనుడుగా పేరుంది. హుండీ లెక్కింపు సమయంలోనే కానుకలను పక్కదారి మళ్లించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. హుండీలో వచ్చిన బంగారు కానుకలు, వెండి వస్తులు, విగ్రహాలు, లాంటి వాటిని ముందే పక్కకు తీసి సూర్యాపేటలోని పూల సెంటర్ సమీపంలో ఉన్న ఒక బంగారు దుకాణంలో విక్రయించి లక్షలు స్వాహా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.

సమాచార హక్కుచట్టంతో అక్రమాలు వెలుగులోకి..

దురాజ్ పల్లి శ్రీ లింగమంతుల స్వామి దేవాలయంలో ఈవో పాల్పడుతున్న అవినీతిని బయటకు తీసుకురావడం కొరకు సూర్యాపేట పట్టణానికి చెందిన ఆ దేవాలయం మాజీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ యాదవ్ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ కు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో స్పందిచిన దేవాదాయ కమిషనర్ ప్రతి వారం పూజ సామాగ్రి కొనుగోలు చేసినట్లు కాకి లెక్కలు చూపారు. కాకి లెక్కలు చూపి లక్షల రూపాయలు స్వామి వారి సొమ్మును నొక్కడం కాకుండా అక్రమమార్గంలో నియాకం జరిగిన ఆ ఉద్యోగులు ఏ దేవాలయంలో ఉద్యోగాలు చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఆక్రమ మార్గంలో నియామకమైన ఉద్యోగులు ఆలయంలో లేకపోవడంతో ప్రతివారం దేవాలయానికి వస్తున్న భక్తులు దేవాలయం పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకొని పూజలు నిర్వహిస్తున్నారు.

విచారణ చేస్తే మరికొన్ని అక్రమాలు వెలుగులోకి..

దురాజ్ పల్లి శ్రీ లింగమంతుల స్వామి దేవాలయం ఈవో పై వస్తున్న ఆరోపణల పై విచారణ చేయాలని జిల్లా ప్రజానీకం, యాదవులు కోరుతున్నారు. గుడి పేరు చెప్పి గుడిలో ఉన్న లింగానికే ఎసరు పెడుతున్న ఈవో పై యాదవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో అందినకాడికి అక్రమ మార్గంలో దోచుకుంటున్న ఈవో పై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపితే మరికొన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయంటున్నారు జిల్లా ప్రజలు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News