పగబట్టిన ప్రకృతి.. నెల రోజుల్లోనే 3 సార్లు వర్షాలు, వడగండ్లు
ప్రకృతి పగ పట్టింది. వివిధ రూపాలుగా రైతులపై కన్నెర్ర చేసింది.
దిశ, తుంగతుర్తి : ప్రకృతి పగ పట్టింది. వివిధ రూపాలుగా రైతులపై కన్నెర్ర చేసింది. నెలరోజుల వ్యవధిలోనే ఏకంగా మూడుసార్లు తన ప్రతాపాన్ని చూపి వారిని కోలుకోని విధంగా దెబ్బతీసింది. ఒకసారి అరకిలో నుండి కిలోవరకు బరువున్న వడగండ్లను తుంగతుర్తి మండలం పై కుమ్మరిస్తే మరో రెండు మార్లు మాత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో గర్జించింది. దీంతో వరి, మిరప, మామిడి, తదితర పంటలన్నీ భారీ స్థాయిలోనే దెబ్బతిన్నాయి. ఊహించని విధంగా ఒక దాని వెంట మరొకటి వెంటవెంటనే జరుగుతున్న పరిణామాలు ఓవైపు రైతాంగాన్ని మరోవైపు అధికార యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాలు పడడం అధికారులు రంగంలోకి దిగి నష్టం వివరాల నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే మళ్లీ వర్షాలు రావడం..మళ్లీ వారంతా ఉరుకులు పరుగులు పెట్టడం లాంటి వ్యవహారాలు అందరిలో ఆసక్తికర చర్చగా మారాయి.
మార్చి 18న...తుంగతుర్తి మండలం గొట్టిపర్తి, రావులపల్లి, మానాపురం తిరుమలగిరి మండలం జలాల్ పురం, మామిడాల తదితర గ్రామాలతో పాటు నాగారం, మద్దిరాల మండలాల్లో వడగండ్ల వర్షం బీభత్సవాన్ని సృష్టించింది. అరకిలో నుండి కిలో సైజులో కురిసిన వడగండ్లు మామిడి, మిరప, వరి పంటలతో పాటు పలువురి నివాస గృహాలను దారుణంగా దెబ్బతీశాయి. మొత్తంగా 14 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. దీనిపై నివేదికలన్నీ తయారై జిల్లాకు చేరాయి.
ఏప్రిల్ 2...ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షాల వల్ల మద్దిరాల, నూతనకల్ మండలాలతో పాటు తుంగతుర్తి మండలంలోని మానాపురం, రావులపల్లి, గొట్టిపర్తి, తదితర ప్రాంతాలలో మామిడి, వరి పంటలు దెబ్బతిన్నాయి. రేపోమాపో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వందలాది క్వింటాళ్ల మిరప వర్షానికి దెబ్బతింది. కొంత వరదల్లో కొట్టుకపోయింది. ఇందులో భాగంగా దాదాపు ఒక వేయి ఎకరాలలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాలతో లెక్క తేల్చారు.
ఏప్రిల్ 21.. వారం రోజుల క్రితమే మండల వ్యాప్తంగా ఏర్పాటైన 23 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వేలాది క్వింటాళ్ల వరి ధాన్యం చేరింది. పలు కారణాలతో తూకాలు నిలిచిపోయాయి. అయినా రైతులు రేయింబవళ్లు కొనుగోలు కేంద్రాలకే అంకితమయ్యారు. ఈ తరుణంలోనే శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా వీచిన బలమైన గాలులు, వర్షంతో కొనుగోలు కేంద్రాలలోని వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. వరి ధాన్యం వరదలకు కొట్టుకుపోయింది. ముఖ్యంగా దేవునిగుట్ట తండ, కొత్తగూడెం, వెలుగుపల్లి, తదితర గ్రామాలలో శనివారం కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని పోగు చేసుకోవడంలో రైతులు నిమగ్నమయ్యారు. ఇది ఇలా ఉంటే కొన్ని గ్రామాలలో కోతకు వచ్చిన వరి పంట నీళ్లలోనే నేలకొరిగింది.