సైకో వీరంగం..రైతును చంపి..ఏం చేశాడంటే..?
రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో రైతును సైకో వడ్లకొండ నాగరాజు కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది
దిశ,రాజాపేట : రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో రైతును సైకో వడ్లకొండ నాగరాజు కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం రైతు మజ్జిగ యాదగిరి తన వ్యవసాయ బావి వద్దకు వెళ్ళిన క్రమంలో అదే గ్రామానికి చెందిన సైకో వడ్లకొండ నాగరాజు చేతిలో ఉన్న కర్రతో అకస్మాత్తుగా దాడి చేసి తలపై తీవ్రంగా గాయపరిచాడు. దీంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకునేసరికి నాగరాజు పరారీ అయ్యాడు. అమాయకుడైన రైతు యాదగిరి సైకో చేతిలో ఆ కారణంగా అకస్మాత్తుగా హత్యకు గురికావడం గ్రామంలో అందరినీ కలిచివేసింది. యాదగిరి మృతదేహం చూసిన వారందరూ కంటనీరు పెట్టుకున్నారు. నాగరాజు వికృత చేష్టలకు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్సై నాగుల ఉపేందర్ యాదవ్ పోలీసు బృందం హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సైకో నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. యాదగిరిగుట్ట ఏసీపి రమేష్, రూరల్ సీఐ కొండలరావు, యాదగిరిగుట్ట పట్టణ సీఐ రమేష్ ప్రత్యేక పోలీసు బృందంతో రఘునాథపురం చేరుకున్నారు. గతంలో నాగరాజు చేసిన దౌర్జన్యాలు, ప్రస్తుత సంఘటన దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగరాజు బాబాయ్ నారాయణ ఇంటి ముందు శవం వేసి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. వడ్లకొండ నాగరాజు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల ఉపేందర్ యాదవ్ చెప్పారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.