Flood Canal : చివరి దశకు వరద కాలువ గండి పూడ్చివేత పనులు..
వరద కాలువ కట్ట మారేపల్లి వద్ద పడిన గండిని సాగునీటి అధికారులు పూడ్చి వేశారు. ఈనెల ఆరో తేదీన కాల్వకట్టకు గండి పడింది.
దిశ, హాలియా : వరద కాలువ కట్ట మారేపల్లి వద్ద పడిన గండిని సాగునీటి అధికారులు పూడ్చి వేశారు. ఈనెల ఆరో తేదీన కాల్వకట్టకు గండి పడింది. వరద కాలువ కింద 27 చెరువులను నింపడంతో పాటు 80 వేల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు ఈనెల రెండో తేదీన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు వరద కాలువకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. గత రెండు సంవత్సరాలుగా నీటి విడుదల లేకపోవడంతో కాల్వకట్ట పలు చోట్ల చెట్లు పెరిగి కోతకు గురి అయింది.
అంతే కాకుండా కాల్వ కట్టవెంట చెట్లు దట్టంగా పెరగడంతో నీటి విడుదల సమయంలో నీటి ప్రవాహానికి మారేపల్లి 36వ కిలోమీటర్ వద్ద ఆరో తేదీన గండి పడింది. దీంతో అధికారులు అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులను ఆరు రోజుల్లో పూర్తిచేశారు. కాల్వ కట్టకు గండిపడడంతో చెరువులను నింప లేక పోయారు. వరద కాలువ కట్ట సుమారు 53 కిలోమీటర్ల మేర ఉండడంతో ప్రమాదాల నివారణకు సాగు నీటి అధికారులు ముందస్తుగా కాలువ కట్టను అన్ని ప్రాంతాల్లో పరిశీలించారు. ఆదివారం సాయంత్రానికి కాల్వకట్ట గండి పూడ్చివేత పనులు పూర్తికానున్నాయని అధికారులు పేర్కొన్నారు.
వరద కాలువకు నీటి విడుదల..
ఈ నెల ఆరో తేదీన అనుముల మండలంలోని మారేపల్లి 36వ కిలోమీటర్ వద్ద కాల్వకట్టకు గండిపడడంతో కాలువలో నీటి విడుదలను నిలిపివేసిన అధికారులు ఆదివారం ఉదయం కాల్వకు తిరిగి నీటిని విడుదల చేశారు. ముందుగా 200 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదలను ప్రారంభించినట్లు సాగునీటి అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రానికి కట్ట మరమ్మతులు పూర్తయ్యే అవకాశం ఉండడంతో కాలువకు పూర్తిస్థాయిలో నీటి విడుదలను చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో బ్రతకాల్లో కింద ఉన్న 27 చెరువులను పూర్తిగా నింపనున్నట్లు తెలిపారు.