సాగర్‌ 22 క్రస్ట్‌ గేట్ల ఎత్తివేత.. కొనసాగుతున్న నీటి విడుదల

నాగార్జునసాగర్‌ జలాశయానికి భారీగా నీటి ప్రవాహం వస్తుండడంతో మొత్తం 22 గేట్లు ఎత్తి 3.55 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.

Update: 2024-08-07 04:45 GMT

దిశ, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌ జలాశయానికి భారీగా నీటి ప్రవాహం వస్తుండడంతో మొత్తం 22 గేట్లు ఎత్తి 3.55 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. 22 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు పంపుతున్నారు. శ్రీశైలం నుంచి 4.03 లక్షల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తుండగా సాగర్‌ జలాశయానికి 3.14 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్‌ నుంచి కాల్వలకు 3.55 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.10 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 298 టిఎంసిలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సాగర్‌కు బిరబిరా కృష్ణమ్మ

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పరవళ్లు తొక్కుతూ సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు.నాగార్జునసాగర్ ప్రాజెక్టు 22 గేట్లను అధికారులు తెరిచారు. దీంతో ఆ ప్రాంతంలో పర్యాటకుల సందడి నెలకొంది. సాగర్ అందాలు చూడడానికి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాగర్ జలాశయం గేట్ల ద్వారా విడుదలవుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కొందరు, స్నేహితులతో మరికొందరు ఇలా సాగర్ అందాలను వీక్షించేందుకు తరలివస్తున్నారు. ఒకవైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరోవైపు సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు కేరింతలు పెడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా పర్యాటకులతో సందడిగా మారింది. వాతావరణం కూడా చల్లగా ఉండటంతో పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి సాగర్ కు చేరుకుంటున్నారు. జల సందడి తో కూడిన సాగర్ డ్యాంను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని పలువురు పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. రేపు, ఎల్లుండి కూడా జలాశయం వద్ద రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


Similar News