కోదాడ హుజుర్ నగర్ నియోజకవర్గాల అంతర్గత రహదారులకు మహార్దశ
హుజుర్ నగర్ కోదాడ నియోజకవర్గల పరిధిలోని గ్రామాల్లో అంతర్గత రహదారులకు మహర్దశ పట్టింది.
దిశ ,హుజూర్ నగర్ : హుజుర్ నగర్ కోదాడ నియోజకవర్గల పరిధిలోని గ్రామాల్లో అంతర్గత రహదారులకు మహర్దశ పట్టింది. దశాబ్దకాలంగా కనీసం మరమ్మతులకు కుడా నోచుకోని ప్రాంతాల్లో కొత్తగా రోడ్డు నిర్మాణాలకు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు నియోజకవర్గాలలో జరుగుతున్న అభివృద్ధి పై మరోసారి తనదైన ముద్ర వేసుకున్నారు. ఏకంగా ఒకేసారి 40 కోట్ల నిధులను మంజూరు చేయిస్తూ.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి చేపట్టిన నూతన రహదారుల నిర్మాణంలో భాగంగా.. విడుదలైన ఉత్తర్వులలో ఆ రెండు నియోజకవర్గాలకు చెందిన గ్రామీణ ప్రాంతాలలో 37.60 కిలోమీటర్ల నూతన రహదారుల నిర్మాణాలు చేపట్టనున్నారు. నియోజకవర్గానికి 25 కోట్ల నిధులు మంజూరు కాగా.. ఉత్తమ్ పద్మావతీ ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గానికి 15 కోట్ల నిధులు మంజూరు చేయించారు. హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో 23.90 కిలోమీటర్లు మేర అంతర్గత రహదారులు నిర్మించనున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గడ్డిపల్లి బరెల్ గ్రౌండ్ నుంచి బొలిశెట్టి గూడెం మీదుగా.. కొనాయిగూడెం వరకు 7 కిలోమీటర్ల దూరం నిర్మించనున్న బి.టి.రోడ్ కు రూ.7.20 కోట్లు మంజూరు చేశారు. గరిడేపల్లి నుంచి సీతారాంతండా వరకు 5 కిలోమీటర్ల కు రూ.5.10 కోట్లు ,నెరేడుచర్ల మండలం దిర్శించర్ల నుంచి ముత్యాలమ్మ కుంట మీదుగా చిట్టివారిగూడెం వరకు 2.90 కిలో మీటర్ల కు రూ.3.20 కోట్లు, మఠం పల్లి మండలం కామాక్షికుంట తండా నుంచి చెన్నాయిపాలెం వరకు 2 కిలోమీటర్లకురూ.2.20 కోట్లు మంజూరు చేశారు. అలాగే అదే మండలం బక్కమంతులగూడెం నుంచి అల్లిపురం వరకు 3 కిలో మీటర్లకు రూ.3.10 కోట్లు,చౌటపల్లి మండలం అల్లిపురం వరకు 4 కిలోమీటర్లకు రూ.4.20 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
అదే విధంగా కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె మండలం నాయకుగూడెం నుంచి విబలాపురం వరకు 3.20 కిలో మీటర్లకు రూ.3.50 కోట్లు మంజూరు చేయగా.. అదే మండలం అన్నారిగూడెం మఱ్ఱి చెట్టు నుంచి కరక్కాయలగూడెం వరకు 2 కిలోమీటర్ల దూరానికి రూ.2.30 కోట్లు, నడిగూడెం మండలం వల్లాపురం నుంచి కేశవాపురం వరకు 2 కిలోమీటర్లకు రూ.2.00 కోట్లు మంజూరు చేశారు. అలాగే మోతె మండలం నామావరం నుంచి సీతానగరం వరకు 4 కిలో మీటర్ల దూరానికి రూ.4.00 కోట్లు నిధులు మంజూరు చేశామని స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలకు అంతంత మాత్రం ఉన్న గ్రామీణ అంతర్గత రహదారులు పూర్తిగా దెబ్బతిన్న నేపద్యంలో.. స్థానిక ప్రజలు,ప్రజాప్రతినిధులు సంయుక్తంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో యుద్ద ప్రాతిపదికన అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించారు. రెండు నియోజకవర్గాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల అంతర్గత రహదారుల నిర్మాణాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేయించడంతో.. నియోజకవర్గ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతున్నాయి.