అక్రమ ఇసుక దందా ఆగదా… అడ్డగోలుగా రవాణా
మండలం, గ్రామం, జిల్లాతో సంబంధంలే.. ఎక్కడైనా దందా చేస్తాం.. బాజప్తుగా సంపాదిన్చుకుంటాం..
దిశ, కల్వకుర్తి : మండలం, గ్రామం, జిల్లాతో సంబంధంలే.. ఎక్కడైనా దందా చేస్తాం.. బాజప్తుగా సంపాదిన్చుకుంటాం..ఎవరికి ఇసుక కావాలన్నా మేము తరలిస్తాం..అన్ని వాగులు.. వంకలు మనవే ..ఎంత సంపాదించుకున్నా తక్కువే.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. జిల్లా అధికారులే అనుమతులుచ్చారు. మమ్మల్ని ఆపేదెవరు.. అడిగేదెవరు.. అదెక్కడో కాదు మన నాగర్ కర్నూల్ జిల్లాదే.. నాగర్ కర్నూల్ జిల్లాలోని వంగూర్, తాడూర్ మండలాల్లోని దుందిభి నదీ పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను దళారులు అక్రమంగా రవాణా చేస్తూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. జేసీబీలతో తవ్వి ట్రాక్టర్ల సహాయంతో బయటకు డంప్ చేసి చుట్టూ పక్కల మండలాలు, గ్రామాలతోపాటు కల్వకుర్తి పట్టణానికి తరలిస్తున్నారు.
రవాణాను అడ్డుకోవాల్సిన పోలిస్, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు తమ బాధ్యత కాదంటూ వ్యవహరిస్తున్నారు. పదుల సంఖ్యలో టిప్పర్లతో రవాణా చేస్తూ నిత్యం లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. వర్షాకాలంలో నది నిండుగా ప్రవహించడంతో వంగూర్ మండలం పోతిరెడ్డిపల్లి వాగు, ఉల్పర వాగు, తాడూర్ మండలం పొల్మూర్ దుందిభి వాగులో ఇసుక మేటలు భారీగా పేరుకుపోయాయి.
భారీగా తవ్వకాలు.. అడ్డగోలుగా రవాణా
జిల్లాలో జాతీయ రోడ్డుతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఇసుక అవసరం ఉంటుంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని దుందుభి వాగు వచ్చే ఇసుకకు మంచి డిమాండ్ ఉంటుంది. పక్క జిల్లాలో క్వారీలకు ఎలాంటి అనుమతులు లేకపోగా, అధికారిక పనులకు కాంట్రాక్టర్లు నాగర్ కర్నూల్ జిల్లా నుంచి ఇసుకను తీసుకొస్తారు. ఒక్కో క్వారీని రూ. 5 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు దక్కించుకుంటారు. నిబంధనలకు విరుద్దంగా జేసీబీల ద్వారా నాలుగు నుంచి ఆరు మీటర్ల మేర తవ్వకాలు సాగిస్తున్నారని సమాచారం. లారీ, టిప్పర్లలో పరిమితికి మించి ఇసుకతో వాహనాలను నింపి ప్రభుత్వ ఆదాయానికి భారీ స్థాయిలో గండి కొడుతున్నారు. నిత్యం లక్షల్లో సంపాదిస్తున్నారంటే అతియోశక్తి లేదు. వాగు నుంచి తరలించేందుకు 12 టైర్లు 4, 14 వి 3, 10 టైర్లవి 7 మొత్తానికి 14 టిప్పర్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నది. ఈ అక్రమ ఇసుక తరలించేందుకు వాహనాల రాకపోకల కోసమై తాత్కాలిక రోడ్లను నిర్మించుకున్నారు. ఇసుక తీసుకుపోయే ప్రాంతంలో, ఆన్ లోడ్ చేసే ప్రాంతంలో దళారులను కాపలా ఉంచుతారు.
రెవెన్యూ స్టాంప్ ఫోర్జరీ ...?
ప్రభుత్వ అనుమతి పొందిన టిప్పర్లు,లారీలు వాగు నుంచి ఇసుకను తరలించాలంటే ప్రతి రోజు ఉదయం 10 గం. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో వే - బిల్లులు పొందాలి. కానీ ఇసుకాసురులు రూటే సపరేటు ... వే బిల్లులు - అధికార స్టాంప్ - దస్తూరి వారే తయారు చేసి అక్రమాలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫోర్జరీ వే బిల్లులు తయారు చేసి ఉదయం 6 గంటలకే టిప్పర్లు, లారీల్లో పరిమితికి మించి ఇసుకను లోడ్ చేసి తరలిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మాకు కలెక్టర్, మైనింగ్ శాఖ అనుమతులు ఉన్నాయి. గృహ, దుకాణ సముదాయాలకు తరలించే అధికారం మాకున్నాయి..మమ్మల్ని అనేవాళ్ళు లేరని వ్యంగంగా మాట్లాడుతున్నారు.
ముగ్గురే.. తెరపైకి మరో వ్యక్తి ...
గతంలో అక్రమ ఇసుకలో ఆరితేరిన వెల్దండ మండలం, వంగూర్ మండలం బిజినపల్లి మండలానికి ముగ్గురు .. నేడు తెర పైకి నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మరో వ్యక్తి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమార్జనే ధ్యేయంగా అడ్డగోలుగా సంపాదిస్తున్నారు.
ఏనిటైం... ఆన్ టైం ..
వంగూర్ మండలం ఉల్పర గ్రామ శివారు, తాడూర్ మండలం పొల్మూర్ దుందుభి వాగు నుంచి జెసిబి, ట్రాక్టర్ల సహాయంతో గుండూర్ గ్రామ శివారులో భారీ స్థాయి ఇసుకను డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి కల్వకుర్తి పట్టణానికి లారీ, టిప్పర్లతో పరిమితికి మించి అధిక లోడుతో ఏనిటైం .. ఆన్ టైం మాదిరిగా తరలిస్తున్నారు. 2 ఘనపు మీటర్ల బకెట్ సామర్థ్యం గల భారీ పొక్లెయిన్లతో ఇసుక తవ్వి మూడు, నాలుగు మీటర్ల లోతు వరకూ ఊడ్చేస్తున్నారు. 18 టన్నుల పరిమితి ఉన్న లారీలో 30-35 టన్నుల ఇసుక లోడ్ చేస్తున్నారు. ముందుగా వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులతో ఒప్పందం కుదుర్చుకొని రాచబాట ఏర్పటు చేసుకుంటున్నారు. అనంతరం అక్రమ ఇసుకను అడ్డగోలుగా తరలిస్తున్నారు. గతంలో ముగ్గురే ఈ తతంగం నడిపేవారు.. నేడు నలుగురయ్యారు. వీరంతా అగ్రకులానికి చెందినవారే కావడం గమనార్హం.
చర్యలు శూన్యం…
అనుమతులిచ్చిన ఇసుక రీచ్‌లో ఎంత పరిమాణం వరకు తవ్వారు.. వాహనంలో ఎంత వెళ్తుంది.. ఎక్కడికి వెళ్తుంది.. సర్కారుకు ఎంత కడుతున్నారు.. ఎంత దండుకుంటున్నారు.. ప్రభుత్వ ఆదాయానికి ఎంత గండి కొడుతున్నరనే ఆలోచన అధికారులలో మెదలడంలేదు. నెల రోజుల నుంచి ఈ తతంగం నడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇసుకాసురుల్ని వెనకేసుకుని రావడమే తమ ప్రధాన బాధ్యత అన్నట్లుగా సంబంధిత శాఖ వ్యవహరిస్తోంది.
ఏ సర్కారు హయాంలో ఐనా కేవలం ఈ ఇసుక మాఫియాను నమ్ముకునే కొందరు పోలీసు అధికారులు ఈ దందా నడిచే మండలాల్లో పోస్టింగ్ ఇప్పించుకుంటున్నారంటే ఇసుక అక్రమ దందా ఏ స్థాయిలో నడిచేదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.