పది లక్షల రూపాయల నిధులు ఏ కుక్క ఎత్తుకు వెళ్ళింది
కోదాడ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దిశ, కోదాడ: కోదాడ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ప్రజలకు కోతులు, కుక్కల వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వాటిని అరికట్టాల్సిన అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో అవి యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. వాటిని అరికట్టేందుకు రూ. 10 లక్షల బడ్జెట్ కేటాయించినా వాటిని అరికట్టలేక పోతున్నారు. మరోవైపు పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థ సక్రమంగా లేకపోవడం తో పందులు, దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. రాత్రి అయితే చాలు వీధులలో, ఇళ్లలో దోమలు వీర విహారం చేస్తున్నాయి. వాటిని నిర్మూలించేందుకు కనీసం ఫాగింగ్ కూడా చేయడం లేదని పట్టణ ప్రజలు అంటున్నారు.
కుక్కలు, కోతులు స్వైర విహారం....
పట్టణంలో కుక్కలు, కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. వారం రోజుల కిందట 17వ వార్డులో ఓ చిన్నారి పై వీధి కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న స్థానికులు ఆ కుక్కలను తరిమి కొట్టకపోతే ప్రాణ ప్రయాణం జరిగి ఉండేది. అంతేకాకుండా గత మూడు రోజుల క్రితం 34 వ వార్డులో గాంధీనగర్‌లో ఒక వ్యక్తిపై కుక్క దాడి చేసే క్రమంలో తప్పించుకునేందుకు పరిగెత్తుతుండగా కింద జారిపడి కాలికి తీవ్ర గాయం అయింది. ఇటీవల శ్రీమన్నారాయణ కాలనీలో డాబా పై ఉన్న వ్యక్తిపై కోతులు దాడి చేయడంతో భయంతో మెట్లపై దిగుతుండగా కాళ్లు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా బుధవారం సాయంత్రం లక్ష్మీపురం కాలనీలో ఓ మహిళపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కల కాటుకు , ఈ ఏడాది జనవరిలో 406, ఫిబ్రవరిలో 379, గత సంవత్సరం ఆగస్టులో 261, అక్టోబర్‌లో 289, సెప్టెంబర్‌లో 156, నవంబర్లో 298, డిసెంబర్ 430, ముందు దీంతో కుక్కల తీవ్రత వాటి వల్ల కలుగుతున్న ఇబ్బందులు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఇదిలా ఉండగా కుక్కలు కోతులు పట్టేందుకు బడ్జెట్‌లో పది లక్షల కేటాయించిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉన్నట్లుగా కోతులు కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పలు విమర్శలకు దారి తీస్తున్నాయి. కుక్కలు, కోతులు పట్టేందుకు మున్సిపాలిటీ నుంచి కేటాయించిన రూ. 10 లక్షలు నిధులు ఏ కుక్క ఎత్తుకెళ్లిందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
దోమల విజృంభణ .
పట్టణంలోని వార్డులలో ఎక్కడ కూడా దోమల నివారణకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దోమల నివారణకు వార్డులలో ఫాగింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ మున్సిపల్ సిబ్బంది చేయకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో పట్టణ ప్రజలు నిద్రలేని రాతిలో గడపాల్సి వస్తుంది. దోమల కుట్టడం వలన విష జ్వరాలు కూడా ప్రబలుతున్నాయి. వర్షాకాలంలో ఉండాల్సిన సీజన్ వ్యాధులు ఇప్పుడు రావడంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు దోమల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
మున్సిపల్ కమిషనర్ రమాదేవి వివరణ..
ఇటీవల మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాను. దోమల నివారణకు కోతుల, కుక్కల నివారణకు తగు చర్యలు తీసుకుంటాం.