ఉగాది నుండి పేదోడి ఇంట ప్రతి రోజు పండగే.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
ఉగాది పర్వదినం నుంచి పేదోడి ఇంట ప్రతి రోజు పండుగే అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
దిశ, కోదాడ : ఉగాది పర్వదినం నుంచి పేదోడి ఇంట ప్రతి రోజు పండుగే అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ ముఖ్యమంత్రి సభ ఏర్పాట్ల పై కోదాడలో ఎమ్మెల్యే ఇంట్లో కార్యకర్తలతో కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుజూర్ నగర్ నుంచి రాష్ట్ర ప్రజలకి సన్న బియ్యం పంపిణీ అందించటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గడిచిన 15 నెలల్లో కోదాడ నియోజకవర్గంలో రోడ్లు, లిప్ట్ ఇరిగేషన్ పథకాలు, యంగ్ ఇండియా పాఠశాలలు లాంటివి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టామని దీనికి కృతజ్ఞతగా కోదాడ కొదమ సింహాలు ముఖ్యమంత్రి సభకి వేలాదిగా తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు.
గత పదేళ్లుగా పాలకులు ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదని మన ప్రభుత్వం రాగానే పేదోడి గురించి అలోచించి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామని, కార్డులో ఉన్న ప్రతి ఒకరికి 6 కేజీల సన్నబియ్యం ఉచితంగా ఇస్తామని, ఎపీఎల్ కుటుంబ సభ్యుల కొరకు ఆకుపచ్చ కార్డు ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల నుండి ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్యకర్తలు స్వచ్చందంగా తరలి రావాలని 50 వేల నుంచి 60 వేల వరకు హాజరు అయి సభను రాష్ట్రంలో ఎక్కడ జరగనంత విధంగా జరిపి విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న, పీసీసీ డెలిగేట్ మెంబర్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, టౌన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.