పట్టపగలే చుక్కలు...దర్జాగా ఫామ్ ల్యాండ్ దందా
కొందరు రియల్టర్లు పట్టపగలే చుక్కలు చూపెడుతున్నారు.
దిశ, నల్గొండ బ్యూరో : కొందరు రియల్టర్లు పట్టపగలే చుక్కలు చూపెడుతున్నారు. లేనిది ఉన్నట్టు ప్రచారం చేస్తూ అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. జిల్లాలో దర్జాగా ఫామ్ ల్యాండ్ దందా కొన సాగుతున్నప్పటికీ వీటిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం వారి వాటా వారు తీసుకొని చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నట్లు ప్రజల నుండి ఆరోపణ ఎదుర్కొంటున్నారు. నార్కెట్ పల్లి మండలం తొండల్వాయి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్లు 637జ, 637ఇ, 639 జ ,639జ1 లలో మొత్తం 10 పది ఎకరాల్లో కేపీ ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో ఫామ్ ల్యాండ్ వెంచర్ నెలకొలిపింది.
ఈ వెంచర్లో ఎలాంటి గ్రామపంచాయతీ కానీ, డీటీసీపీ అనుమతులు లేకుండానే యథుచ్ఛగా, అనధికారికంగా 30 ఫీట్ల రోడ్లు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీటీసీపీ అనుమతులు లేకుండా వ్యవసాయ భూమిలో రోడ్లు వేసి ప్లాట్లుగా చేసి స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధం. నిబంధనలకు వ్యతిరేకంగా వెంచర్లు చేసి గజానికి రూ.2499చొప్పున విక్రయిస్తున్నారు. కేపీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఈ అనధికారిక ఫామ్ ల్యాండు వెంచర్ లో అమాయక ప్రజలకు ఎర్రచందనం చెట్లు 30, 30 పండ్ల మొక్కలు, 12 సంవత్సరాల ఫ్రీ మెయింటెనెన్స్ అని, వెంచర్ మొత్తం చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ గోడ ఏర్పాటు చేశామని క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పట్టాదారు పాస్ పుస్తకం, రైతుబంధు, రైతు బీమాకు అర్హులవుతారని రంగు రంగు బ్రోచర్లు చూపించి ప్రజలకు మాయమాటలు చెప్పి గజానికి రూ. 2499 చొప్పున 10 గుంటలకు రూ. 30.23 లక్షలకు ఒక ప్లాటు గా విక్రయాలు జరుపుతూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు.
నిజానికి ఈ ప్రాంతంలో ఈ 10 గుంటల డబ్బుల పెట్టుబడితో ఎకరం భూమి కొనుగోలు చేయవచ్చునని చుట్టుపక్కల రైతులు దిశకు తెలిపారు. అదేవిధంగా 10 గుంటల ప్లాట్ లో ఎర్రచందనం చెట్లకు 12 సంవత్సరాలలో రూ.40 నుంచి 50 లక్షల ఆదాయం వస్తుందని, వచ్చిన ఆదాయంలో పట్టాదారునికి 60 శాతం, మెయింటెనెన్స్ చెసిన యాజమాన్యానికి 40 శాతం చెప్పున ముందుగానే యాజమాన్యం ఎంఓయూ రాసి ఇవ్వడాన్ని చూసి ఆకర్షితులవుతున్న అమాయక ప్రజలు వీరి వలలో పడుతూ మోసపోతూ వీధిన పడుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్ అధికారులు కేపీ ఇన్ఫ్రా డెవలపర్ వెంచర్ యాజమాన్యంపై చర్యలు చేపట్టి అమాయక జనాన్ని ఆర్థికంగా నష్టపోకుండా రక్షించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గ్రామపంచాయతీ ఆదాయానికి గండి
కేపీ ఇన్ఫ్రా డెవలపర్స్ యాజమాన్యం ఎలాంటి డీటీసీపీ అనుమతులు లేకుండా అనధికారికంగా ఫామ్ ల్యాండ్ వెంచర్ చేయడం వల్ల తొండల్వాయి గ్రామపంచాయతీకి 10 ఎకరాల వెంచర్ కు గాను 10 శాతం భూమి చొప్పున రెండున్నర ఎకరాలు రావాల్సి ఉంది. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం పైన తెలిపిన భూమి రూ. 75 లక్షలు కోల్పోవడమే కాకుండా నగదు రూపంలో వచ్చే ఆదయానికి సైతం గండి పడుతుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతర్..!
తెలంగాణ రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే రియల్ ఎస్టేట్ కంపెనీల ఫామ్ ల్యాండ్ వ్యాపారాన్ని నియంత్రించేందుకుగాను తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అండ్ అర్బ న్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తేదీ 9.7.2021న పంచాయతీరాజ్ యాక్ట్ 2018, మున్సిపల్ యాక్ట్ 2019 నూతన చట్టం ప్రకారం ఫామ్ ల్యాండ్ వెంచర్లకు కనీసం 20 గుంటల తక్కువగా ఎలాంటి రిజిస్ట్రేన్ లు చేయవద్దని మొమో నెంబర్ 2461/ pLa111/2020 ద్వారా తెలంగాణ రాష్ట్రం లోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు, జాయింట్ సబ్ రిజిస్టార్లకు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ నార్కెట్ పల్లి తహసీల్దార్ ఈ ఉత్తర్వులను బేఖాతర్ చేస్తున్నారు.
వెంచర్ యాజమాని కి నోటీసులు ఇచ్చాం : సుధాకర్, ఇంఛార్జి ఎంపీడీఓ నార్కట్ పల్లి
గ్రామంలో ఏర్పాటు చేసిన వెంచర్ యజమానికి నోటీసులు ఇచ్చాం. ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి రాతపూర్వకమైన సమాధానం రాలేదు. సమాధానం వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.