సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పొద్దు
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన తెలిపారు.
దిశ,నల్లగొండ : తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అలాగే కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చొని నిరసన దీక్ష చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులు 18 సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా 19600 మందికి పైగా అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో ఏపీవోలు, సిస్టమ్ అనలిస్టులు, టెక్నికల్ పర్సన్స్, ఆపరేటర్స్, డీఎంఎల్టీ , మెసెంజర్సు ,మండల స్థాయిలో కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఈఈఆర్పీ లు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, పాఠశాల స్థాయిలో పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు, పీఈటీలు, వర్క్ ఎడ్యుకేషన్ టీచర్లు, అదేవిధంగా కేజీబీవీ, యుఆర్ఎస్ లలో స్పెషల్ ఆఫీసర్లు తదితరులు సేవలందిస్తున్నారని తెలిపారు.
గతంలో వరంగల్ జిల్లాలో నిరసన కార్యక్రమం చేపడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి 2023 లో ధర్నా పాయింట్ దగ్గరికి వచ్చి మా నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని, తాము అధికారంలోకి రాగానే ప్రజాభవనానికి పిలిచి మీ డిమాండ్ నెరవేర్చే దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగులందరినీ క్రమబద్దీకరణ చేయాలని, అప్పటివరకు బేసిక్ పే కల్పించాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షల, ఆరోగ్య బీమా ఐదు లక్షల సౌకర్యం కల్పించాలి వంటి పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కాగా తపస్ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ వీరికి మద్దతు తెలిపారు. ఎస్ఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మహేందర్, సీసీఓ జిల్లా అధ్యక్షులు వెంకట్, సీఆర్పి జిల్లా అధ్యక్షులు కృష్ణ, ప్రధాన కార్యదర్శి నాగరాజు, పుష్పలత, కేజీబీవీ నాయకులు మంజుల, విజయశ్రీ, మెసెంజర్లు ఎండీ. రహీం, వెంకట్, కేజీబీవీఎస్ఓలు విజయశ్రీ,, కవిత, సీఆర్పీలు నాగయ్య, ఐఆర్ఈలు, ఎంఐఎస్ లు, పీటీఐ లు, సీసీఓలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా "దిశ"లో గత ఏడాది సమగ్ర శిక్ష ఉద్యోగులకు రేవంత్ రెడ్డి హామీ అనే కథనం ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.