ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
ధరణి దరఖాస్తుల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులను ఆదేశించారు.
దిశ, పెన్ పహాడ్: ధరణి దరఖాస్తుల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో బుధవారం పెన్ పహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పెండింగ్ దరఖాస్తులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన రైతు అనిత జిల్లా కలెక్టర్‌ను కలిసి గత 5 సంవత్సరాలుగా తమ భూమి సమస్య పై తిరుగుతున్నానని కానీ నన్ను ఏ అధికారి పట్టించుకోవడం లేదని కలెక్టర్‌కు విన్నవించుకుంది. వెంటనే కలెక్టర్ తహసీల్దార్‌తో చెప్పి అనిత దరఖాస్తును పరిశీలించారు. తన తల్లి నుంచి సంక్రమించిన రెండు ఎకరాల భూమిని ఐదు సంవత్సరాల క్రితం వేరొక పేరు మీద నమోదు చేశారని అనిత కలెక్టర్‌కు తెలిపింది. ఫైల్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కొత్త ధరణి మాడ్యూల్స్‌ని పరిశీలించి తహసీల్దార్‌కి పలు సూచనలు చేశారు. అనిత భూమి గురించి అక్కడ ఉన్న గ్రామ రైతులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
2008లో తన తల్లి ఇచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని అప్పుడు పాస్ బుక్ కూడా వచ్చిందని 2017 లో ఆ భూమికి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే క్రమంలో వేరొకరి పేరు పై నమోదు చేశారని, అప్పటి నుంచి తిరుగుతుండగా కొత్త ప్రభుత్వం ఇచ్చిన ధరణి మాడ్యూల్స్‌లో మాలాంటి రైతుల సమస్యలు పరిష్కరించబడుతున్నవని, ప్రభుత్వం పెట్టిన ధరణి మాడ్యూల్స్ ఎంతో ఉపయోగకరంగా ఉందని అనిత అన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు తనకు వెంటనే తన సమస్యను పరిష్కరించినందుకు ఆమె కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఆర్ఐ స్వప్న, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.