మహిళా సాధికారతతోనే దేశ పురోభివృద్ధి

మహిళా సాధికారతతోనే దేశ పురోభివృద్ధి సాధిస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అభిప్రాయ పడ్డారు.

Update: 2024-03-07 13:08 GMT

దిశ, సూర్యాపేట: మహిళా సాధికారతతోనే దేశ పురోభివృద్ధి సాధిస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అభిప్రాయ పడ్డారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)బిఎస్ లతతో కలిసి హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ప్రసంగించారు. సమాజ సేవలో మహిళలు ముందు ఉండటంతో పాటు ఓర్పు, సహనంతో తమ కుటుంబాలను తీర్చిదిద్దుతారని కితాబిచ్చారు. మహిళలలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగతిలో ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ జిల్లాలో అదనపు కలెక్టర్లు ఇద్దరు కూడా మహిళలు కావటం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. వారి సహకారంతో జిల్లాను అభివృద్ధిలో ముందంజలో ఉంచుతామని, అర్హులైన వారు చివరి వరుసలో ఉన్న వారికి పథకాలు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఈ జిల్లాలో ఉన్న మహిళలు గ్రూపులుగా ఏర్పడి, బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకొని నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేస్తూ మన జిల్లాలోనే కాదు వేరే జిల్లాలకు కూడా ఎగుమతి చేయడం శుభపరిణామం అని తెలిపారు. పీఎంఎఫ్ఎంఈ లో మన జిల్లాను మొదటి ర్యాంక్‌లో ఉంచిన్నందుకు మహిళలందరికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు మహిళలు గురించి పాడిన పాటలు బాగున్నాయని వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ )బిఎస్ లత మాట్లాడుతూ మహిళలపై ఎవరు వివక్షత చూపరాదని, మన పిల్లలని తప్పటడుగులు వేయకుండా మహిళల పట్ల గౌరవంగా ఉండేలా పెంచాలని, కుటుంబ బంధాలను బాధ్యతగా సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.

మహిళలకు విద్య, వైద్యం,ఆస్తి, ఓటు హక్కు అనేవి సమానంగా రాజ్యాంగం ద్వారా పొందామని, ఈ అవకాశం కల్పించిన రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్. అంబేద్కర్‌ను గుర్తు చేస్తూ కొనియాడారు. తదుపరి జిల్లా కలెక్టర్ వికలాంగులకు ఒక్కొక్క స్కూటీ విలువ రూ.1,25,000 కలిగిన 15 స్కూటీలను,అలాగే ఒక్కొక్క ఛార్జింగ్ బ్యాటరీతో నడిచే త్రీ వీలర్ చైర్ విలువ రూ. 80,000 గల 6, త్రీ వీలర్ చైర్లను, సుమారు రూ. 25 లక్షల విలువ గల వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బీఎస్ లత, డీడబ్ల్యూఓ వెంకట రమణ, జడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ లత, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, పలువురు మహిళా జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రభుత్వ ఉద్యోగులను కలెక్టర్ సన్మానించారు.


Similar News