జోరుగా సాగుతున్న కల్తీ వ్యాపారం..?

సూర్యాపేట జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల వ్యాపారం జోరుగా

Update: 2024-08-22 16:13 GMT

దిశ,సూర్యాపేట కలెక్టరేట్: సూర్యాపేట జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల వ్యాపారం జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ వ్యాపారం పై అధికారులు ఉక్కు పాదం మోపు తుండగా సూర్యాపేట జిల్లాలో మాత్రం ఎవరూ పట్టించుకోకపోవడంతో కల్తీ వ్యాపారులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్  లేకపోవడంతో కల్తీ జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

రాజ్యమేలుతున్న కల్తీ..?

ఏ సీజన్​లో అయినా డల్ అవ్వని బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఫుడ్ బిజినెస్ మాత్రమే. కానీ హోటల్ పేరుతో కొంతమంది చేస్తున్న అక్రమాలు తెలిసి, బయట ఫుడ్ తినాలంటేనే ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు, అపరిశుభ్రమైన వంటశాలలు కావడమే ఇందుకు నిదర్శనం. జిల్లా లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్‌క్రీం పార్లర్లు, కాఫీ షాప్‌లలోనూ ఇదే పరిస్థితి ఉందని బయటకు వెళ్లి ఏదైనా తినాలని అనుకుంటే ఒక్కసారి ఆలోచించాల్సిందే! అని కంటికి ఇంపుగా కనిపించే ఆహార పదార్థాలన్నీ మేలైనవి కావని,అందులో నాసిరకం ఉండవచ్చు. ప్రమాదకరమైన పదార్థాలూ కలవొచ్చు. అని పలువురు ఆరోపిస్తున్నారు.

పలు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా చాలావరకు కాలం చెల్లినవి, పాడైపోయినవి ఉంటున్నాయని . గడువు తీరినవి, ఎలాంటి బ్రాండ్‌ లేని పాల ప్యాకెట్లను తక్కువ ధరకు కొని వాడుతున్నారని,వండిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచుతున్నారని, ఆర్డర్లు వచ్చినప్పుడు వేడి చేసి, మసాలాలు కలిపి ఇస్తున్నారని వినియోగదారులకు కల్తీ ఆహార పదార్థాలను అంటగడుతూ వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి.

కనిపించని అధికారులు..

ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించడానికి సూర్యాపేట జిల్లాలో సిబ్బంది ఉన్నారా లేరా అనే విషయం అంతు చిక్కడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ తో పాటు సిబ్బంది లేరనే సమాచారంతో ఇదే అదునుగా భావించి కల్తీ పదార్థాలను వినియోగదారులకు అంటగడుతున్నారని కల్తీ దారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని కల్తీ జరిగిందని కనీసం ఫిర్యాదు చేయడానికి కలెక్టరేట్ లోని ఆఫీసుకు వచ్చిన ఆఫీస్ తాళం వేసే ఉంటుందని ఆఫీసు తాళం తీసే వారే కరువయ్యారని పిర్యాదు చేయడానికి వచ్చిన వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించేందుకు, కల్తీ పదార్థాలను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిని నియమించాలని ప్రజలు కోరుకుంటున్నారు.


Similar News