పదేళ్లు ప్రజా సంక్షేమంలోనే కొనసాగా
తన పదేళ్ల పదవి కాలంలో ప్రజా సంక్షేమానికి ముందుండి నడిపించానని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ వెల్లడించారు.
దిశ, తుంగతుర్తి: తన పదేళ్ల పదవి కాలంలో ప్రజా సంక్షేమానికి ముందుండి నడిపించానని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామ గ్రామానికి విస్తరించానని తద్వారా అవన్నీ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తిరుమలగిరి మండలం జలాల్ పురం, అనంతారం, నందాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. అంతకుముందు ఆయా గ్రామ ప్రజలు వీరతిలకం దిద్ది, మహిళలు మంగళ హారతులు, బోనాలు, కోలాటాలు వేస్తూ డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ... 2014 ముందు తుంగతుర్తి పరిస్థితి ఎలా ఉందో...? అనంతరం ఎలా మారిందో...? గ్రహించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రభుత్వం ద్వారా రూ. 6 వేల కోట్ల పై బడి నిధులు తీసుకొచ్చి తుంగతుర్తి ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేశానని వివరించారు. గోదావరి జలాలతో రైతాంగం కాళ్లు కడిగానని స్పష్టం చేశారు. ఒకనాడు కరవుతో అల్లాడిన తుంగతుర్తి ప్రాంతం నేడు పచ్చదనంతో సస్యశ్యామలమైందని గుర్తు చేశారు. అనంతరం మొండి చింత తండా, మానాపురం, మంచతండా, తాళ్ల సింగారంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన వందలాదిమంది ఆయా పార్టీలకు రాజీనామాలు చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.