చైర్మన్ వర్సెస్ కమిషనర్.. మిర్యాలగూడ మున్సిపాలిటీలో వర్గపోరు..
ఆయనొక మున్సిపల్ ప్రథమ పౌరుడు. ఆయనకు తెలియకుండా మున్సిపల్ పరిధిలో జరగని పని ఉండదు.
దిశ, మిర్యాలగూడ టౌన్ : ఆయనొక మున్సిపల్ ప్రథమ పౌరుడు. ఆయనకు తెలియకుండా మున్సిపల్ పరిధిలో జరగని పని ఉండదు. తెలియకూడని సమాచారం ఉండదు. అనుభవం లేని నాయకుడు అసలు కాదు. రెండు సార్లు చైర్మన్ పదవి అనుభవం చవి చూసిన ఘనుడు. పట్టణం పై పూర్తి స్దాయిలో అవగాహన, అధికారుల పై అజమాయిషీ, రాజకీయంగా అండ దండలు ఉన్న ప్రజా ప్రతినిధి. మున్సిపాలిటిలో ఆయన రాజకీయ పరిస్థితి ప్రస్తుతం అనిశ్చితి మార్గం వైపు పయనిస్తుందా అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి.
మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న తిరునగర్ భార్గవ్ ఈ నెల 8న మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి, సూపర్వైజర్ లకు మున్సిపాలిటీకి సంబంధించిన సమాచారం ఇవ్వాలని లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలో ఇప్పటి వరకు అనుమతులు లేని కట్టడాల వివరాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణ అనుమతులు, అనాధికార కట్టడాలు, అనధికారికంగా చేపట్టిన భవనాల పై తీసుకునే చర్యలకు సంబంధించి వివరాలు కోరుతూ దరఖాస్తు చేశారు. ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తున్న మున్సిపాలిటీ వివరాల కోసం ఆయనే దరఖాస్తు చేయడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భార్గవ్ సతీమణి నాగమణి మున్సిపల్ చైర్ పర్సన్ గా పనిచేశారు. అయినప్పటికీ వివరాల అడగడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.
కమిషనర్, చైర్మన్ మధ్య విభేదాలు..
మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ తిరునగర్ భార్గవ్, కమిషనర్ యూసుఫ్ అలీ మధ్య సయోధ్య కుదరడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల చైర్మన్ పట్టణంలో భూ ఆక్రమణ చేశారని నోటీసులను కమిషనర్ జారీ చేశారు. అంతేకాకుండా ఆ భూమికి సంబంధించిన దస్తావేజులను సమర్పించాలని కోరారు. ఈ విషయంలో ఇరువురి మధ్య విభేదాలకు దారి తీసిందని చర్చ జరుగుతుంది. చైర్మన్ బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి మున్సిపాలిటిలో వర్గ పోరు నడుస్తుంది.
లేఖ బయటకు ఎలా వచ్చిందో.. మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్..
మున్సిపాలిటి పరిధిలో భవనాల కట్టడాలు, అనుమతులకు సంబంధించిన సమాచారం కోసం కమిషనర్ కు, టౌన్ ప్లానింగ్ అధికారులకు లేఖ రాశాను. ఈ లేఖ బయటకు ఎలా పొక్కిందో అర్థం కావడం లేదు. జనరల్ సమాచారంలో భాగంగా లేఖ రాశాను.