గంజాయి నిందితుడి అరెస్టు
అక్రమంగా గంజాయి అమ్ముతున్న యువకుడిని స్థానిక పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
దిశ, మిర్యాలగూడ : అక్రమంగా గంజాయి అమ్ముతున్న యువకుడిని స్థానిక పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం శాంతినగర్ కు చెందిన సిరికొండ భాను ప్రకాష్ తండ్రి 8 సంవత్సరాల క్రితం చనిపోగా.. చెడు వ్యసనాలకు అలవాటు పడి గంజాయి అమ్ముతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా నవంబర్ నెలలో భద్రాచలం సమీపంలోని చింతూరు, కుంట, కురుమనూరు గ్రామాల నుంచి 2.5 కిలోల గంజాయి కొనుగోలు చేసి ఇప్పటికే హైదరాబాదులోని దూల్పేట, పటన్ చెరువు గీతం కాలేజీ, ఇబ్రహీంపట్నం సిద్ధార్థ కాలేజ్ ల వద్ద విక్రయించాడు. కాగా మరో 1200 గ్రాముల గంజాయిని తీసుకొచ్చి మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ, ముత్తిరెడ్డి కుంట, సుందర్ నగర్, త్రిపురారం గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులకు 50 గ్రాముల ప్యాకెట్ కు వెయ్యి రూపాయల చొప్పున విక్రయించినట్లు తెలిపారు. మిగిలిన గంజాయిని తీసుకొని మిర్యాలగూడ పట్టణంలోని బోటింగ్ సమీపంలో తిరుగుతుండగా పోలీసులకు నమ్మదగిన సమాచారం అందడంతో అదుపులోనికి తీసుకొని విచారించినట్లు పేర్కొన్నారు. నిందితుడు నుంచి 1.3 కేజీల గంజాయి, మొబైల్ ఫోను ,2000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి తెలిపారు. నిందితుడిని పట్టుకున్న వన్టౌన్ ఇన్చార్జి సిఐ కరుణాకర్, ఎస్సై సుధీర్ కుమార్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, హుస్సేన్, శ్రీను, వీరబాబు, నరసింహ తదితరులను అభినందించారు.