గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ గదిలో బీరు బాటిల్స్...

ఆమెది క్రూరత్వం కలిగిన మైండని, ఆమె వికృత చేష్టలతో మాకు భయమేస్తోందని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల,జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థినులు

Update: 2024-07-06 09:07 GMT

దిశ, సూర్యాపేట : ఆమెది క్రూరత్వం కలిగిన మైండని, ఆమె వికృత చేష్టలతో మాకు భయమేస్తోందని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల,జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఈనెల 3న ఆ కళాశాల ప్రిన్సిపాల్ పై చేసిన ఆరోపణలు అక్షరాల నిజమయ్యాయి. సూర్యాపేట జిల్లా మండలంలోని బాలెంల వద్ద గల తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గది నుంచి ఓ బ్యాగ్ ని శుక్రవారం రాత్రి అసిస్టెంట్ కేర్ టేకర్ సౌమిత్రి బయటకు తీసుకెళ్తుండగా అనుమానం వచ్చిన విద్యార్థినులు ఆమెను అడ్డగించి ఆ బ్యాగ్ ని ఓపెన్ చేసి చూడగా అందులో నాలుగు బీరు బాటిల్స్ లభ్యమయ్యాయి.

దీంతో షాక్ తిన్న విద్యార్థినులు ఇన్చార్జి ప్రిన్సిపాల్ షేక్ జకీరా బేగంకి సమాచారం అందించి ఆమె ఆధ్వర్యంలోనే ఆ బాటిళ్లను ఓ గదిలో పెట్టి తాళం వేశారు. శనివారం ఉదయమే సంబంధిత శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్ డి ఓ ఆర్.వేణు మాధవ్ రావు, డీఎస్పీ జి.రవి కుమార్,ఆర్టీఓ అరుణ కుమారి, పట్టణ సీఐ రాజశేఖర్ లు కళాశాలకు చేరుకొని విద్యార్థినులను జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఘటనపై పూర్తి విచారణ జరిగేంత వరకు విద్యార్థినిలు ఓపికతో ఉండాలని, ఎవరూ కూడా ఆందోళనకు గురి కావద్దని సూచించారు. ఈ సమయంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు భారీ సంఖ్యలో చేరుకొని ప్రిన్సిపాల్ శైలజను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా హాస్టల్ కాంట్రాక్టర్ ఉన్న రాములు అనే వ్యక్తి ఆ బీరు బాటిళ్లు కళాశాలకు తీసుకొచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఇంకా మరికొన్ని నిజానిజాలు తెలియాల్సి ఉంది.


Similar News