భువనగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్ల హవా.. పట్టించుకోని ఉన్నతాధికారులు

భువనగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్ల హవా కొనసాగుతోంది.

Update: 2024-01-14 02:18 GMT
భువనగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్ల హవా.. పట్టించుకోని ఉన్నతాధికారులు
  • whatsapp icon

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్ల హవా కొనసాగుతోంది. సాధారణ ప్రజలు కార్యాలయానికి తమ‌ పనుల కోసం నేరుగా వెళ్తే పనులు కావని, రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారని, అదే ఏజెంట్ల నుంచి వెళితే.. పనులు వెంటనే మాత్రం‌ తప్పకుండా అవుతాయంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో పూర్తిగా ఏజెంట్ల మాటకే అధికారులు ప్రాధాన్యం ఇస్తారని, ఏసీబీ అధికారుల సోదాలతో ఈ విషయం బహిర్గతమైంది.

మొత్తం కార్యాలయంలోనే..

ప్రజలు రకరకాల పనుల నిమిత్తం భువనగిరి ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తుంటారు. అయితే, వీరిని కార్యాలయ ఆవరణలోని పార్కింగ్ దగ్గర నుంచే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇక కార్యాలయ ఆవరణలోనికి ఫొటోలు దిగడం కోసం, అప్లికేషన్లు ఇవ్వడానికి వెళ్లిన ప్రజలు, స్లాట్ బుక్ చేసుకొని వెళ్లిన ప్రజలను ఇక్కడ ఎందుకు నిలబడ్డారు, అక్కడ ఎందుకు నిలబడ్డారు అని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే అధికారులను అడగడానికి కార్యాలయం లోపటికి వెళ్లడానికి మాత్రం అస్సలు అనుమతించరు. అదే ఏజెంట్లు మాత్రం కార్యాలయం లోపటికి యథేచ్ఛగా వెళ్తుంటారు. కార్యాలయంలో లోపట బయట వారికి ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఎజెంట్ల ద్వారా వెళ్తేనే పని పూర్తి..

ఆర్టీఏ కార్యాలయానికి ప్రజలు నేరుగా వెళ్తే వారి పనులు కావని, ఏజెంట్ల ద్వారా వెళ్తే మాత్రం పనులు తప్పకుండా అవుతాయని ప్రజలు చెపుతున్నారు. ప్రతి పనికి ఒక రేటు చొప్పున తప్పకుండా సమర్పించుకోవాల్సిందేనని ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో ఏజెంట్ల హవా కొనసాగుతున్న ఏ అధికారి కూడా వీటి పైన గమనార్హం. అధికారులే స్వయంగా ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేయించుకుంటున్నారని ఏసీబీ సోదాలలో వెళ్లడికావడంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

గత కొన్నేళ్లుగా అక్కడే ఉద్యోగం..

భువనగిరి డీటీవో సురేందర్ రెడ్డి దాదాపు ఎనమిదేళ్లుగా యాదాద్రి భువనగిరి జిల్లా డీటీవోగా పని చేస్తున్నారు. ఆయనతో పాటు మరి కొంతమంది అధికారులు కూడా ఏళ్లుగా ఇక్కడే తిష్ట వేశారని పలువురు వాహనాదారులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి పనికి ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పనిదే పనులు కావని లారీ, ఆటో డ్రైవర్లు, ఓనర్లు, ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ఒక డీటీవో స్థాయి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కడంతోనైనా భువనగిరి ఆర్టీఏ కార్యాలయంలోని అవినీతికి చెక్ పడుతుందా అని ప్రజలు భావిస్తున్నారు. కార్యాలయంలో ఉన్న అవినీతిని అంతమొందించి సామాన్య ప్రజలకు కార్యాలయం సేవలు నేరుగా అందించడానికి ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు భువనగిరి ఆర్టీఏ కార్యాలయం పైన దృష్టి సారించి కొందరు అధికారులు చేసే అవినీతిని అంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News