కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యేగా...
మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఎన్నికైన బత్తుల లక్ష్మా రెడ్డి జిల్లా రాజకీయ నేతల్లో ప్రత్యేకత సంతరించుకున్నాడు.
దిశ, మిర్యాలగూడ : మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఎన్నికైన బత్తుల లక్ష్మా రెడ్డి జిల్లా రాజకీయ నేతల్లో ప్రత్యేకత సంతరించుకున్నాడు. వారసత్వ నేపథ్యం, సుదీర్ఘ రాజకీయ అనుభవం లేనప్పటికీ మొదటి సారిగా 2023 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి 50 వేల పై మెజారిటీ సాధించి సునామి సృష్టించాడు. కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులెవరు ప్రచారానికి రానప్పటికీ, రాజకీయ చాణక్యుడైన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పై భారీ మెజారిటీ సాధించడం విశ్లేషకులకి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది.
నాలుగేండ్ల క్రితం బీఎల్ఆర్ బ్రదర్స్ పేరుతో మజ్జిగ పంపిణీ, అన్నదాన కార్యక్రమాల ద్వారా సామాజిక సేవకుడిగా మిర్యాలగూడ ప్రజలకు చేరువయ్యాడు బీఎల్ఆర్ సేవే పెట్టుబడిగా 2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి తన ఇమేజ్ తో మరో 20 మంది కౌన్సిలర్లను గెలిపించి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికయ్యాడు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం చేసిన బీఎల్ఆర్.. అప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిన అమరేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ లతో పోటీపడి జానారెడ్డి లాంటి సీనియర్ నేతలను ఒప్పించి పార్టీ అభ్యర్థిగా బీ ఫారం తెచ్చుకోవడం చరిత్రగా మారింది. బీఎల్ఆర్ కాంగ్రెస్ బీ ఫార్మ్ తెచ్చుకోవడంతోనే ఆయన గెలుపు ఖాయమయింది. సేవాతత్పరతకు ప్రజలు తమ విలువైన ఓటు ద్వారా అధికారం కట్టబెట్టి రుణం తీర్చుకున్నారు.