ముందు చెప్పినట్టుగానే... కేసీఆర్ ను గద్దె దింపాం : కోమటిరెడ్డి

ముందు చెప్పినట్టుగానే కేసీఆర్ ను గద్దె దింపుతామన్నాం..బీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీని బొంద పెడతామన్నాం...అన్నట్టే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సహకారంతో దాన్ని ఆచరణలో చేసి చూపెట్టామని మునుగోడు శాసనసభ్యులు,భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Update: 2024-04-14 13:53 GMT

దిశ,తుంగతుర్తి: ముందు చెప్పినట్టుగానే కేసీఆర్ ను గద్దె దింపుతామన్నాం..బీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీని బొంద పెడతామన్నాం...అన్నట్టే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సహకారంతో దాన్ని ఆచరణలో చేసి చూపెట్టామని మునుగోడు శాసనసభ్యులు,భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పునరుద్ఘాటించారు. అంతే కాదు కవిత తీహార్ జైల్లో బతుకమ్మ ఆడుతుందనే విషయం కూడా చెప్పుకొచ్చానని గుర్తు చేశారు. ముఖ్యంగా నీకు,నీ బాస్ కెసిఆర్ కు అడ్రస్ లేకుండా చేస్తాం...ఖబర్దార్ అంటూ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని ఆయన హెచ్చరించారు.మేం తలుచుకుంటే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని పేర్కొన్నారు.

పది ఏండ్లు తెలంగాణ పేరు చెప్పి నువ్వు, నీ కేసీఆర్ దోచుకున్న లక్షల కోట్లు కక్కిస్తామంటూ శపథం చేశారు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలలో భాగంగా తిరుమలగిరిలో ఆదివారం జరిగిన తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. కిరాయి ఇంట్లో ఉంటూ డొక్కు స్కూటర్ మీద తిరిగే నీకు వేల కోట్లు ఎలా వచ్చాయో..? నాగారం మండల కేంద్రంలో పెద్ద కోటనే ఎలా కట్టావు, శంషాబాద్ లోని వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ ఎలా నిర్మించారాని ప్రశ్నించారు. వీటన్నింటిపై లెక్కలు తీస్తామని దుయ్యబట్టారు. ఉద్యమ కాలంలో సెంటిమెంట్ తో రెచ్చగొట్టి విద్యార్థుల ప్రాణాలు బలిగొన్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.

మాజీ మంత్రి దామోదర్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం నీకు ఏనాడు లేదని జగదీష్ రెడ్డిని పేర్కొంటూ వివరించారు. 2018లో మా పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను లాక్కొని తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేశారని, బంగారు తెలంగాణను దోచుకొని అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. అహంకారంతో విర్రవీగిన బీఆర్ఎస్ పార్టీకి నేడు పోటీ చేసే అభ్యర్థులే దొరకడం లేదని పేర్కొన్నారు. మరో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు.ప్రధాని మోడీ వచ్చిన కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుని ఆపలేరని,పైగా లక్షల ఓట్ల మెజార్టీ వస్తుందని అన్నారు.

ఈనెల 21న భువనగిరిలో జరిగే అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామాల కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు సరొత్తం రెడ్డి, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల లక్ష్మి, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న, ఉపాధ్యక్షులు యోగానంద చార్యులు, తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్ పర్సన్ శాగంటి అనసూయ తో పాటు పలువురు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


Similar News