లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జెండగే అధికారులను ఆదేశించారు.

Update: 2024-03-06 15:46 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జెండగే అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు - 2024 ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించబడే బ్రహ్మోత్సవాలలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామీణ నీటిపారుదల శాఖ మంచి నీటి సరఫరా పెంచాలని, ప్రత్యేకంగా 17, 18, 19 వ తేదీలలో ఎక్కువ సంఖ్యలో నీటి సరఫరా మరింత మెరుగుపరచాలని, భక్తులు తాగునీటికి ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

పుణ్యక్షేత్రంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల నుండి అదనపు సిబ్బందిని నియమించుకొని పారిశుద్ధ్య చర్యలు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో బస్సుల సంఖ్య పెంచాలని, అన్ని మండల కేంద్రాల నుంచి బస్సులు నడపాలని, సమయపాలన పాటించాలని, ముఖ్యంగా స్వామి వారి కళ్యాణం జరిగే 18 వ తేదీ రాత్రి 8 : 45 గంటలకు కళ్యాణం పూర్తయిన తర్వాత తిరిగి వెళ్లేందుకు అధిక సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసుకోవాలని, ఉప్పల్, చెంగిచెర్ల డిపోల సహకారంతో అదనపు బస్సులను ఏర్పాటు చేసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజరును ఆదేశించారు.

అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా యాదగిరిగుట్ట పట్టణంలో, గుట్ట పైన అగ్నిమాపక ఫైర్ సర్వీసులతో సిబ్బంది సదా సిద్ధంగా ఉండాలని తెలిపారు. 104, 108 అంబులెన్స్ సర్వీసులను అందుబాటులో ఉంచాలని, గుట్ట పైన కింద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అత్యవసర మందులను సిద్ధం చేసుకోవాలని, 24x7 వైద్య సిబ్బంది విధులు నిర్వహించాలని, హృద్రోగ నిపుణులు, వారి బ్లడ్ గ్రూపుకు సరిపడు బ్లడ్ బాటిల్స్ అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. ప్రముఖుల రాక సందర్భంగా ప్రోటోకాల్ ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని, అధిక సంఖ్యలో భక్తులు వివిధ వాహనాలు ద్వారా వస్తున్నందున, అన్ని వాహనములను గుట్ట పైకి అనుమతించకుండా, బస్సుల సదుపాయం సద్వినియోగం చేసుకోవాలని, గుట్ట ఘాట్ రోడ్ మీద షాపులకు అనుమతి ఇవ్వకుండా తగు చర్యలు తీసుకోవాలని భువనగిరి ఆర్డీవోకు సూచించారు. ఆర్ అండ్ బి అధికారులు రోడ్ల పైన ఉన్న గుంతలను పూడ్చాలని, అవసరమైన మరమ్మతులను చేపట్టాలని ఆదేశించారు. గుట్టపైకి అనుమతించే ఆటోల సామర్థ్యానికి మించి భక్తులను ఆటోలలో ఎక్కించుకోకుండా ఆటోలు నడిపేవారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయవలసిందిగా రవాణా అధికారికి సూచించారు.

బ్రహ్మోత్సవములు జరిగే రోజుల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని, ఒకవేళ ఏదైనా అంతరాయము ఏర్పడితే మొబైల్ ట్రాన్స్ ఫార్మర్, జెనరేటర్ అందుబాటులో చేసుకోవలసిందిగా విద్యుత్ శాఖకు సూచించారు. ప్రముఖుల పర్యటనలు ఉంటున్నందున కొన్ని కాటేజ్‌లను ముందే రిజర్వు ఉంచుకోవాలని, అలాగే భక్తుల దర్శనాలకు సంబంధించి వివిధ స్థాయిలలో, చోట్లలో వాలంటీర్లను అధికంగా నియమించుకొని ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరిగుట్ట, పరిసర గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అధికారులు, వీఐపీలు భారీ ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్నందున భారీ భద్రత చర్యలు, పార్కింగ్ ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని డిప్యూటీ పోలీస్ కమీషనర్‌ను కోరారు. డీసీపీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో బందోబస్తు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, ప్రముఖుల సెక్యూరిటీ తదితర ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు పోలీసు శాఖ తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో అమరేందర్, యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావు, ఏసీపీ రమేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ డీఎం శ్రీనివాస్, వాటర్ గ్రిడ్ ఇంజనీర్ అరుణ రాథోడ్, రోడ్లు భవనాలు, రవాణా, ట్రాఫిక్, పోలీసు అధికారులు, సూపరింటెండెంట్ కే.పార్టీ సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Similar News