Miryalaguda : ఆధార్ దందా.. అక్రమంగా సవరణలకు భారీగా వసూళ్లు

ఆధార్ అనేది 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య.

Update: 2024-08-01 02:01 GMT

దిశ,మిర్యాలగూడ టౌన్ : ఆధార్ అనేది 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ) ఈ సేకరించిన వివరాల ఆధారంగా ప్రతి వ్యక్తికి ఆధార్ జారీ చేస్తుంది. అలాంటి ఆధార్ కార్డు నమోదు లో దందా ను సాగిస్తూ నిర్వహకులు లక్షల రూపాయాలు దండుకుంటున్నారు. నిబంధనలను అతిక్రమించి ఆధార్ కార్డులో వివరాలను నమోదు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం తో నిర్వహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆధార్ లో చేర్పులు ,మార్పులు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో ఒక్కరి నుంచి వేల రూపాయాలు వసూళ్లు చేస్తున్నారు.

చేయాల్సింది ఇలా ...

మిర్యాలగూడ పట్టణం లో ఏజెన్సీల ద్వారా మిర్యాలగూడ ఎండీవో కార్యాలయం ,యూనియన్ బ్యాంక్ ,ఎస్బీఐ ఏసీబి బ్యాంక్ ,సుందరయ్య పార్క్ ,తహసీల్దార్ కార్యాలయం , ముత్తిరెడ్డి కుంట ,మిల్లర్స్ అసోషియన్ సమీపంలో ,వేములపల్లి ,దామరచర్ల మండల కార్యాలయాల లో ఆధార్ కేంద్రాలు ఉన్నాయి. ఆధార్ కార్డులో ముఖ్యంగా పేరు నమోదు తప్పు ఒప్పులు ,జనన తేదీ నమోదు ,అడ్రస్ మార్పులు ,వేలి ముద్రల నమోదు ,ఫోటో మార్పులు చేయనున్నారు. వీటి నమోదుకు సరియగు పత్రాలు ఉంటే నే ఆన్ లైన్ ప్రక్రియ అవుతుంది. ఈ నిబంధనలతో సంబంధిత సర్టిఫికేట్లను స్కాన్ చేసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటి కోసం రూ. 100 వసూళ్లు చేస్తున్నారు.

మయా చేసి మార్పులు చేస్తూ ..

ఆధార్ సెంటర్ల నిర్వహకులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పొందుటకు వయస్సు నిబంధ పెట్టింది. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండానే ఆధార్ లో పుట్టిన తేదీ వివరాలను సరి చేస్తున్నారు. ఇలా వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకొని చేయకూడని పనులను చేస్తున్నారు. పుట్టిన తేది ల వివరాల నమోదు కు రూ. 5 వేల నుంచి 7 వేల వరకు వసూలు చేస్తున్నారు. అడ్రస్ మార్పులకురూ. 2000 నుంచి 3000 వరకు వసూలు చేస్తున్నారు. నమోదు ప్రక్రియలో భాగంగా సంబంధిత ఆధార పూరితమైన సర్టిఫికెట్ లకు బదులుగా తప్పుడు సర్టిఫికెట్ లు స్కాన్ చేసి ఆధార్ కార్డులో అక్రమంగా చేర్పులు ,మార్పులు చేస్తూ లక్షల రూపాయాల అక్రమార్జనకు పాల్పడుతున్నారు. మిర్యాలగూడ పట్టణం లోని ఎండీవో కార్యాలయంలో ,ముత్తిరెడ్డి కుంట, సుందరయ్య పార్క్ ఆధార్ కేంద్రాల లో ఈ దందా సాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయంతో ఓ నిర్వహకుడు రెండు కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్వహకుడు సంబంధిత అధికారులకు నెల వారీగా మాముళ్లు అందజేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అధికారుల పర్యవేక్షణ శూన్యం ..

ఆధార్ కేంద్రాల నిర్వహణపై అధికారులు పర్యవేక్షణ చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. కేంద్రాల లో పని తీరు సక్రమంగా లేక ఇబ్బందులు కూడా పడుతున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. నెల వారి మామూళ్లు అందుతుండటంతో నిర్వహణపై అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News