నేడే మదర్ డెయిరీ చైర్మన్ ఎన్నిక.. క్యాంపు రాజకీయాలకు తెరలేపిన టీఆర్ఎస్!
నల్లగొండ - రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘం(మదర్ డెయిరీ) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మూడు డైరెక్టర్ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ - రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘం(మదర్ డెయిరీ) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మూడు డైరెక్టర్ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ తహతహలాడుతోంది. అందుకోసం టీఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. డైరెక్టర్ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్న పాల సంఘం చైర్మన్లను పెద్ద అంబర్పేట్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌కు తరలించారు. అక్కడే మందు చిందులతో వారిలో ఫుల్ జోష్ను నింపే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో సోమవారం రోజు పాల సంఘం చైర్మన్ అందరినీ ఫంక్షన్ హాల్‌కు తరలించారు. రాత్రికి అక్కడే బస ఏర్పాట్లను సైతం చేశారు. అంతటితో ఆగకుండా మహిళలతో బతుకమ్మ ఆడించడం మగవాళ్ళతో మందు విందులో మునిగితేలేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.
ఆలేరుకి మొదటి చైర్మన్ పీఠం..
మదర్ డైరీలో అత్యధికంగా పాల సంఘం చైర్మన్లు సంఘాలు సభ్యత్వం కలిగి ఉన్నది ఆలేరు నియోజకవర్గం చెందిన వారే అధికం. అయితే ఇప్పటివరకు ఆలేరు నియోజకవర్గానికి మదర్ డైరీ చైర్మన్ పీఠం అందరి ద్రాక్షగా మారింది. సుదీర్ఘ కాలం పాటు మదర్ డెయిరీని గుత్తా జితేందర్ రెడ్డి ఏక ఛక్రాధిపత్యం వహించడంతో ఆలేరుకు చైర్మన్ పీఠం దక్కలేదు. అయితే, గత ఎన్నికల్లో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి.. మదర్ డెయిరీ పీఠాన్ని ఆలేరు నియోజకవర్గానికి దక్కించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ, అనూహ్యంగా ఎన్నికల్లో మదర్ డెయిరీ చైర్మన్ పీఠాన్ని రామన్నపేట మండలానికి చెందిన గంగుల కృష్ణారెడ్డికి దక్కింది. అయితే, గంగుల కృష్ణారెడ్డి డైరెక్టర్గా ఐదేళ్ల పదవీకాలం పూర్తి కావడంతో చైర్మన్ ఎన్నిక అనివార్యమే అయ్యింది. మంగళవారం మూడు డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించిన అనంతరం చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. అయితే ఈసారి చైర్మన్ పీఠాన్ని గొంగిడి మహేందర్ రెడ్డికి సన్నిహితులుగా చెప్పుకునే శ్రీకర్ రెడ్డి, సోమిరెడ్డి.. ఇద్దరిలో ఒకరికి పదవి దక్కనుందని విశ్వసించే వర్గాల సమాచారం. అందులో భాగంగానే డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి.. చైర్మన్లను క్యాంపునకు తరలించడం దగ్గర్నుంచి.. వారికి క్యాంపులో సకల వసతులను ఏర్పాటు చేయడంలో బిజీ అయిపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైర్మన్లు ఇంటికి వెళితే సమీకరణాలు మారుతాయని నేపథ్యంలో రాత్రి ఫంక్షన్ హాల్లోనే బస చేసేందుకు వీలుగా అప్పటికప్పుడు బెడ్లను సైతం తెప్పించి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.
3 డైరెక్టర్ స్థానాలు.. 5 మంది పోటీలో..
ప్రస్తుతం మదర్ డెయిరీలో 3 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో మొత్తం ఐదుగురు పోటీలో ఉన్నారు. ముగ్గురు అభ్యర్థులు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు కాగా, మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు. అయితే, ఈ ఎన్నిక ప్రక్రియలో మొత్తం 282 మంది చైర్మన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరంతా ముగ్గురు డైరెక్టర్లకు ఓట్లు వేయనున్నారు. ఇందులో అత్యధికంగా ఎవరికి ఓట్లు దక్కితే వారు డైరెక్టర్గా గెలుపొందినట్లు ప్రకటిస్తారు. అయితే, డైరెక్టర్ పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. ఈ డైరెక్టర్లంతా కలిసి చైర్మన్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. సదరు చైర్మన్ ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. అయితే డైరెక్టర్గా గెలుపొంది ఐదు సంవత్సరాలు పూర్తైతే మాత్రం కొత్త చైర్మన్ ఎన్నికను జరపాల్సి ఉంటుంది.
భారీగా చేతులు మారిన డబ్బు..
మదర్ డెయిరీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి అధికార పార్టీ నేతల మధ్య భారీగా డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తోంది. మదర్ చైర్మన్ అభ్యర్థిగా గెలుపొందడం కోసం ఒక్కో పాల సంఘం చైర్మన్ కు రూ. 20 వేల నుంచి 30 వేలు చెల్లించినట్టుగా సమాచారం. దీనికి తోడు డైరెక్టర్ల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంలోనూ ప్రజాప్రతినిధులు తాయిలాలు పుచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఓ మండలానికి చెందిన డైరెక్టర్‌ను గతంలో డైరెక్టర్‌గా ఉన్నప్పటికీ మరోసారి అతనికి డైరెక్టర్గా అవకాశం రాకపోవడానికి ఆర్థిక లావాదేవీలే కారణమనే ఆరోపణలు లేకపోలేదు. ఇదిలా ఉంటే సుదీర్ఘ కాలం పాటు మదర్ డెయిరీ చైర్మన్‌గా పనిచేసిన గుత్తా జితేందర్ రెడ్డి సైతం మరోసారి తనకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే, ఆయన జిల్లా టీఆర్ఎస్ నేతలతో కాకుండా నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి హామీ తీసుకునేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే జితేందర్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు చైర్మన్‌గా పనిచేశారని, ఈ పదవి కాకుండా ఏదైనా ప్రత్యామ్నయం ఆలోచిద్దామని సీఎం కేసీఆర్ సున్నితంగా చెప్పినట్టుగా తెలుస్తోంది.