మైనంపల్లి వివాదం.. కవిత కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీల నాయకులు నాపై విమర్శలు చేశారన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ తొలిజాబితాపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ ఎమ్మెల్సీ కవిత మీడియాతో బుధవారం మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీల నాయకులు తనపై విమర్శలు చేశారన్నారు. మహిళా బిల్లుకు కచ్చితంగా ప్రాధాన్యత వుందన్నారు. దేశ వ్యాప్తంగా 14 లక్షల పైచిలుకు మహిళలు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నారన్నారు. కానీ పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందన్నారు. మహిళ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు పక్కదారి పట్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు.
నెహ్రూ కేబినెట్‌లో కేవలం ఒక్క మహిళా మంత్రి మాత్రమే వున్నారని గుర్తుచేశారు. నేడు మోడీ కేబినెట్‌లో ఇద్దరు మహిళలు మంత్రులుగా ఉన్నారన్నారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎన్నికయ్యారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు లేవన్నారు. 1996 లో తొలిసారి దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు. 2010 లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిందన్నారు.
కానీ లోక్ సభలో పాస్ కాలేదన్నారు. గత పదేళ్లుగా మోడీకి లోక్ సభలో మెజారిటీ ఉన్నా ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయలేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారన్నారు. డిసెంబర్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో ధర్నా చేస్తానని తెలిపారు. సోనియాగాంధీకి, ప్రియాంక గాంధీకి, బీజేపీ మహిళా నేతలకు ఆహ్వానాలు పంపుతామన్నారు. ఎవరికి ఓటు వేసిన బీజేపీకి పడుతుంది అన్న ఎంపీ ఆరవింద్ వ్యాఖ్యలతో ఈవీఎంలపై అనుమానం కలుగుతోందన్నారు.
దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ ఘటన జరిగిన తర్వాత వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరానని తెలిపారు. పోలీసులపై శాఖా పరమైన చర్యలు తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలపై మాకు నమ్మకం ఉందన్నారు. అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. ఇక, మైనంపల్లి వివాదంపై స్పందించిన కవిత మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎవరికైనా సహనం వుండాలన్నారు. మైనంపల్లి విషయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. పార్టీ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడాల్సిందే అన్నారు.