పట్టు వీడని మైనంపల్లి.. రెండు సీట్లకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్!
రాజకీయాల్లో సంచనాలకు మారు పేరుగా నిలిచే మైనంపల్లి పట్టిన పట్టు వీడవకుండా మెదక్ బరిలో కుమారుడిని నిలిపేందుకు అంతా సిద్ధం చేశారు.
రాజకీయాల్లో సంచనాలకు మారు పేరుగా నిలిచే మైనంపల్లి పట్టిన పట్టు వీడవకుండా మెదక్ బరిలో కుమారుడిని నిలిపేందుకు అంతా సిద్ధం చేశారు. అధికార బీఆర్ఎస్ మెదక్ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించిన ఈసారి తనయుడి రాజకీయ రంగ ప్రవేశమే ధ్యేయంగా అడుగులు వేసిన మైనంపల్లి అందరి అంచనాలు మారుస్తూ కాంగ్రెస్ పార్టీలో రెండు సీట్ల హామీతో ఆ పార్టీ కండువా ఢిల్లీ పెద్దల సాక్షిగా కప్పుకొని పార్టీలో చేరారు. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంత మంది అనుచరులతో వెళ్లిన ఆయన పార్టీలో చేరారు.
మైనంపల్లి హన్మంతరావు ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగా ఉంటుందన్నది రాజకీయవర్గాల్లో తెలిసిన విషయమే. ఎవరూ ఊహించని విధంగా ఆరు నెలల క్రితం కుమారుడు రోహిత్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే చివరి నిమిషంలో బీఆర్‌ఎస్ నుంచి తన కుమారుడికి టికెట్ దక్కకపోవడంతో మంత్రి హరీశ్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నెల 22న అధికార పార్టీకి రాజీనామా చేశారు. అయితే మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరికతో మెదక్ నుంచి బీఆర్‌ఎస్ అసమ్మతి నేతలు ఆయన వెంటే నడిచే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
– దిశ, మెదక్ ప్రతినిధి
గతంలో మైనంపల్లి గెలిచిన మెదక్ నియోజకవర్గం నుంచే బరిలో దించాలని భావించిన ఆయన మైనంపల్లి సేవా సర్వీస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు 25 వేల ఫిక్స్డ్ డిపాజిట్, గ్రామాల్లో అడిగిన వెంటనే బోర్లు వేయించి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు.. కానీ బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి సేవా కార్యక్రమాలు చేసినా.. అధికార పార్టీ ప్రకటించిన జాబితాలో మల్కాజ్ గిరి నుంచి హన్మంతరావుకు మాత్రమే ఇచ్చారు. మెదక్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే అధిష్టానం టిక్కెట్ ప్రకటించింది.
రోహిత్ టిక్కెట్ రాకుండా మంత్రి హరీశ్ రావు అడ్డుకున్నాడన్న ఉద్దేశంతో మైనంపల్లి హన్మంతరావు ఘాటు విమర్శలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కానీ బీఆర్ఎస్ అధిష్టానం మైనంపల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఆయన కుమారుడి కోసం ఈ నెల 22 న అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆ పార్టీకి చెందిన రాష్ట్ర ముఖ్య నేతలు దామోదర రాజనర్సింహ, మల్లు భట్టి విక్రమార్కతో పలువురు హన్మంతరావు వద్దకు వెళ్లి ఆహ్వానించారు. అయితే మెదక్, మాల్కాజిగిరి రెండు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని కోరడంతో అందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు..
మైనంపల్లి వెంట బీఆర్ఎస్ అసమ్మతి నేతలు..
మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కుమారుడు రోహిత్ కాంగ్రెస్ జాతీయ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. అయితే మెదక్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు కూడా పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. మెదక్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ అసమ్మతి నేతలు సైతం మైనంపల్లితో కలిసి పార్టీలో చేరారు. రామాయంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, ప్రముఖ న్యాయవాది జీవన్ రావు, చిన్నశంకరంపేట సర్పంచ్ కొలుకురి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ శేరి మహేందర్ రెడ్డి, పోతరాజు మనోజ్, గడిల సుధాకర్ ముఖ్య నాయకులు చిరంజీవి, మెడి గణేష్, స్వామి నాయక్ ఉన్నారు. వీరంతా కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొనసాగుతున్న వారే కావడం గమనార్హం.