టీఆర్ఎస్‌గా మారాల్సిన సమయం వచ్చింది.. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర ట్వీట్
బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తాజాగా పోస్ట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో జరుగుతున్న కొంతమంది ప్రక్క రాష్ట్ర సమైక్య వాదుల దాడిని అరికట్టాలంటే ప్రాంతీయతత్వం బ్రతకాలంటే, తెలంగాణ ఆత్మ గౌరవం, యాస, భాష, సంస్కృతిని కాపాడడానికి బీఆర్ఎస్ పేరు నుంచి టీఆర్ఎస్‌గా మారాల్సిన అవసరం చాలా ఉందని తెలిపారు.
సమైక్య వాదులు కూడా జై తెలంగాణ నినాదంను గౌరవించిన మన రాష్ట్రంలో, నేటి పాలనలో జై తెలంగాణ నినాదం ఎత్తితే లాఠీలతో కొట్టే రోజులు రావడం చాలా బాధాకరమన్నారు. ఢిల్లీ నుంచి పాలన అందిస్తున్న కేంద్ర పార్టీల కంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని, ఉద్యమాన్ని ఉరకలెత్తించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను తెచ్చిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం కోసం పార్టీ పేరు టీఆర్ఎస్‌గా మారాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.