నిజామాబాద్‌లో మునుగోడు ఫార్ములా.. Kalvakuntla Kavitha భారీ స్కెచ్!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. 2014లో ఎన్నికల్లో గెలుపు అదే ఊపుతో 2018లో తిరుగులేని విజయం..

Update: 2022-11-29 02:02 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. 2014లో ఎన్నికల్లో గెలుపు అదే ఊపుతో 2018లో తిరుగులేని విజయం.. కానీ కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఓటమి రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో సంచలనంగా మారింది. అనంతరం రాజకీయాల్లో ఆచితూచి వ్యవహరించిన ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి దిగారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని అంశాలపై ఫోకస్ పెంచారు. తనను తన కుటుంబాన్ని ప్రతి సారి విమర్శించే నిజామాబాద్ ఎంపీ అరవింద్ టార్గెట్‌గా భారీ స్కెచ్ వేశారు. ఎక్కడ పోటీ చేసినా వేంటాడి ఓడిస్తా అంటూ ఇటీవల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను ఉద్ధేశించి ఎమ్మెల్సీ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేపదే తనపై సీఎం కేసీఆర్‌పై అరవింద్ ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. కాగా కవిత కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గేతో ఫోన్‌లో మాట్లాడారని పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారని అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కవిత తీవ్ర ఆగ్రహంతో ప్రెస్ మీట్‌లో అరవింద్‌పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ శ్రేణులు కవితపై వ్యాఖ్యలకు నిరసనగా అరవింద్ ఇంట్లో దూరి మరి దాడి చేశాయి.

ప్లాన్ అదేనా..

ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల వెనక స్కెచ్ భారీగానే ఉన్నట్లు సమాచారం. నిజామాబాద్ ఎంపీగానే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న కవిత ఈ దఫా కూడా అరవింద్ పైనే పోటీ చేసి ఓడించాలని భావిస్తున్నారు. రెండో దఫా టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చినా అప్పటి ఎంపీగా ఉన్న కవిత ఓటమి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో 2024 లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. మునుగోడులో టీఆర్ఎస్ తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్లు, ఎమ్మెల్సీలను మొహరించి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.. బీజేపీని రాష్ట్రంలో కట్టడి చేయాలని భావిస్తున్న టీఆర్ఎస్‌కు మునుగోడు విజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. నిజామాబాద్‌లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్లు, కీలక నేతలను దించి సత్ఫలితాలు సాధించేందుకు టీఆర్ఎస్ వ్యుహాలు రచిస్తోంది. తమతో కలిసివచ్చే పార్టీలు, నాయకులు, ఉద్యోగసంఘాల మద్ధతు కూడగట్టి ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. ఎమ్మెల్యే ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ జరగనుండటంతో సమయం కూడా తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ బాస్ భావిస్తున్నారు.

అభివృద్ధిపై ఫోకస్..

ఈ మేరకు నిజామాబాద్‌పై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ సరిపోకపోవడంతో కొత్త బస్టాండ్ నిర్మాణం, సమీకృత మార్కెట్లు, ఆడిటోరియం, క్రీడా మైదానం, ఉద్యాన వనాలు, వైకుంఠధామాలు, హజ్ భవనాలు నిర్మించాలని జిల్లా నేతలను ఆదేశించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సీఎం జిల్లాకు వచ్చిన నేపథ్యంలో రూ.100 కోట్లు మంజూరు చేశారు. త్వరలోనే రూ.50 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖను ఆదేశించారు. జిల్లాలో మరో సారి సీఎం పర్యటించనున్నట్లు తెలిసింది. జిల్లాలో సిట్టింగ్ స్థానాలన్ని టీఆర్ఎస్‌కే దక్కేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ ప్రజాప్రతినిధులతో భేటీ అయిన సీఎం కేసీఆర్ అభివద్ధి పనుల్లో వేగం పెంచాలని అన్ని వర్గాలకు చేరువ కావాలని దిశా నిర్ధేశం చేశారు. జిల్లాలో అన్ని ఎమ్మెల్యే స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకోగా ఎంపీ స్థానం మాత్రం బీజేపీ సొంతం చేసుకుంది. అదే టీఆర్ఎస్‌కు సంకటంగా మారింది. అరవింద్ టీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్, కేటీఆర్, కవితను టార్గె్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడంతో గుస్సా మీద ఉన్న టీఆర్ఎస్ ఎలాగైనా ఈ సారి అరవింద్‌ను ఓడించాలనే నిర్ణయానికి వచ్చారు. కవిత సైతం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాపై ఫోకస్ పెంచారు. ఇటీవలకామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం తాండూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బీజేపీ తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌లో ఎలాగైనా గెలవాలని చూస్తున్న కవిత ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అనే వేచి చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి : కేసీఆర్ ఎలక్షన్​టీమ్ రెడీ​? తలమునకలైన సీఎస్ !

Tags:    

Similar News