సమయం లేదు మిత్రమా.. నెక్స్ట్ లెవల్‌కు మునుగోడు ప్రచారం
మునుగోడు ఉప ఎన్నికల ప్రచార ఘట్టం ముగింపు దశకు చేరువలో ఉంది. కేవలం మరో వారమే మిగిలి ఉంది.
దిశ, తెలంగాణ బ్యూరో : మునుగోడు ఉప ఎన్నికల ప్రచార ఘట్టం ముగింపు దశకు చేరువలో ఉంది. కేవలం మరో వారమే మిగిలి ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ ఢీ.. అంటే ఢీ.. అంటున్నాయి. బీజేపీ ఇప్పటికే డోర్ టు డోర్ ప్రచారంతో దూసుకెళ్తోంది. టీఆర్ఎస్ సైతం అదే స్థాయిలో ప్రచారం చేపడుతోంది. ఇదిలా ఉండగా సమయం తగ్గుతున్నా కొద్దీ అభ్యర్థులు, నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతుండటంతో నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తమ పార్టీ అభ్యర్థే గెలుస్తాడంటే.. తమ పార్టీ అభ్యర్తే గెలుస్తాడని ధీమా వ్యక్తంచేస్తున్నారు. తమకు తాము సర్దిచెప్పుకుని ప్రచారంలో ముందుకుసాగుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి నవంబర్ 1వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. పోలింగ్ నవంబర్ 3వ తేదీన జరగనుంది. ప్రచారానికి మరో వారమే మిగిలి ఉండటంతో ఇక నుంచి మరో లెవల్ కు ప్రచార శైలి మారనుంది. నేతలు ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలకు మరింత పదును పెట్టనున్నారు. దీపావళి తర్వాత ప్రచారం మరో లెవల్ కు చేరనుంది. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నేతలు దీపావళికి కూడా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ప్రచారంలో తలమునకలై ఉన్నారు. పండుగ కావడంతో ప్రతి ఓటరూ స్వగ్రామానికి వస్తాడని, ఈ అవకాశాన్ని వదులుకోకుండా వారి ఓట్లు తమ పార్టీకే పడేలా ప్రసన్నం చేసుకోవాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.
ఇప్పటికే మునగోడులో దీపావళి వేడుకలకు గాను ఓటర్లకు ప్రతి ఇంటికీ టపాసులు, ఇతర సామగ్రి అందిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీపావళి అనంతరం ప్రచారం మరోస్థాయికి చేరుకోనుంది. నేతల వరుస సభలు, సమావేశాలతో హోరెత్తనుంది. ఈనెల 30వ తేదీన చండూరులో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మరుసటి రోజే మునుగోడులో బీజపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభ ఉంది. ప్రచారం చివరిరోజైన నవంబర్ 1న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇప్పటికే బూత్ స్థాయి నుంచి ఓటర్లను కలిసి తెలంగాణ ప్రభుత్వం చేసిన మోసాలు, నెరవేర్చని హామీలను బీజేపీ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తోంది. మరోవారం మాత్రమే మిగిలి ఉండటంతో దీన్ని మరింత స్పీడప్ చేయనుంది. గెలుపు తమదేననే ధీమాతో అన్ని పార్టీలు ఉన్నా.. విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి : బీజేపీకి గుడ్ బై.. టీఆర్ఎస్‌లోకి మాజీ ఎంపీ