దేశ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ అక్టోబర్ 23వ తేదీన తెలంగాణలోకి ఎంటర్ అయి నవంబర్ 7వ తేదీ వరకు కొనసాగుతుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' అక్టోబర్ 23వ తేదీన తెలంగాణలోకి ఎంటర్ అయి నవంబర్ 7వ తేదీ వరకు కొనసాగుతుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. భారత్ జోడో యాత్ర దేశ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అవుతుందని, ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో యాత్ర ఇంకా ఎక్కువ సక్సెస్ అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో అనేక వర్గాలను రాహుల్ కలుస్తారని, రాజకీయాలకు అతీతమైన వారు, మేధావులు యాత్రలో ఉంటారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమైన రైతాంగ, పోడు భూములు, నిరుద్యోగ సమస్యలపై రాహుల్ మాట్లాడుతారని వివరించారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ సమస్య రెట్టింపు అయ్యిందని మండిపడ్డారు. మునుగోడులో ప్రజాస్వామ్యం అపహస్యం అయ్యేలా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రవర్తిస్తున్నాయని, మద్యం, డబ్బు ప్రభావంతో గెలవాలని రెండు పార్టీల నాయకులు సిగ్గు శరం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఎన్నికల సంఘం నిస్సహాయంగా పనిచేస్తోందని, రాజకీయాలు ఇంత దిగజారడానికి కారణం సీఎం కేసీఆర్ అని దుయ్యబట్టారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మాట్లాడుతూ.. దేశంలో కులాలు, వర్గాల వారీగా విడదీసే ప్రయత్నం జరుగుతోందని, రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ హితం కోసమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, వినోద్ కుమార్, అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.