తప్పు లేకపోతే కడిగిన ముత్యంలా పొంగులేటి బయటకు వస్తారు.. బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) ఇంట్లో ఈడీ(Enforcement Directorate) దాడులపై ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) స్పందించారు.

Update: 2024-09-27 12:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) ఇంట్లో ఈడీ(Enforcement Directorate) దాడులపై ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పొంగులేటి విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందని అన్నారు. పొంగులేటి ఇంటిపై ఈడీ(ED) దాడులు జరుగడం ఇది మొదటిసారి కాదని తెలిపారు. ఆయన కుమారుడి వాచ్ విషయంలోనూ ఈడీ దాడులు జరిగాయని గుర్తుచేశారు. ఈడీ దాడులకు బీజేపీ(BJP)కి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తప్పు జరుగకపోతే కడిగిన ముత్యంలా మంత్రి పొంగులేటి బయటకు వస్తారని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే.

జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంతో పాటు మొత్తం 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేశారు. హిమాయత్‌సాగర్‌లోని పొంగులేటి ఫాంహౌస్‌, ఆయన కుమార్తె, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. ఇదిలా ఉండగా.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పొంగులేటి నివాసాలు, ఆఫీసులపై ఈడీ, ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్‌ 3న ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాలతోపాటు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌‌లో ఉన్న ఇంట్లో సోదాలు చేశారు. అదేవిధంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో రాఘవా ప్రైడ్‌లోనూ తనిఖీలు నిర్వహించారు.


Similar News