కాంగ్రెస్‌లో వెంకట్ రెడ్డి కల్లోలం.. ఆస్ట్రేలియాకు వెళ్లినా మారని తీరు!

ఓవైపు మునుగోడు ఉప ఎన్నిక.. మరోవైపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. రెండూ కీలక పరిణామాలు చోటు చేసుకున్న సమయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Update: 2022-10-23 01:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఓవైపు మునుగోడు ఉప ఎన్నిక.. మరోవైపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. రెండూ కీలక పరిణామాలు చోటు చేసుకున్న సమయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విదేశీ బాట పట్టారు. ఇటు జోడో యాత్ర, అటు ఉప ఎన్నికలు ముగిసేదాకా ఆయన ఆస్ట్రేలియాలోనే ఉండనున్నారు. ఇప్పుడు దేశంలోనే లేకున్నా.. విమర్శలు మాత్రం ఆపలేదు. సొంత పార్టీ ఓడిపోతుందంటూ జోస్యం చెప్పడం పార్టీలో వివాదంగా మారుతోంది. ఇప్పటికే కొంతమంది నేతలు ఏఐసీసీకి ఫిర్యాదు చేయగా.. మరికొందరు ఏకంగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తాజా పరిణామాల్లో వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించండి అంటూ గాంధీభవన్‌లో నినాదాలు చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం అంతు చిక్కకుండా మారింది. పార్టీలకతీతంగా అందరూ రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలంటూ ఓవైపు ఆడియో చక్కర్లు కొడుతుంటే ఆస్ట్రేలియా పర్యటనలో అభిమానులతో మాట్లాడిన వీడియో మరోవైపు వైరల్‌ అవుతోంది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్‌ ఎంపీ వెంకట్ రెడ్డి.. అక్కడ కాంగ్రెస్‌ కార్యకర్తలు, సన్నిహితులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా మునుగోడు ఉప​ఎన్నికపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 'మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. నేను వెళ్లి ఎన్నికల ప్రచారం చేసినా పదివేల ఓట్లు వస్తాయి.. తప్ప పార్టీ గెలిచే పరిస్థితి మాత్రం లేదు. రెండు అధికార పార్టీలు (టీఆర్ఎస్-బీజేపీ) కొట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? డబ్బులు కాంగ్రెస్ పెట్టలేదు. నేను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేశా.. ఎంపీగా కొనసాగుతున్నాను. ఇక విశ్రాంతి తీసుకుంటానన్నారు. రాష్ట్రమంతా తిరిగి పాదయాత్ర చేద్దామనుకున్నా. కానీ, కాంగ్రెస్‌లో ఒక్కొక్కరిది ఒక్కో గ్రూపు' అని కోమటిరెడ్డి అన్న వాఖ్యలు రాష్ట్రంలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓటు వేయాలంటూ వెంకట్‌రెడ్డి చెప్పిన ఆడియో ఒకటి సంచలనం సృష్టించింది. అన్నింటీకీ తన సోదరుడు సాయం చేస్తుంటాడని, పార్టీ చూడకుండా తనకు ఓటేయాలని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

ఏం చేద్దాం

రాష్ట్ర కాంగ్రెస్‌లో వెంకటరెడ్డి కొరకరాని కొయ్యగా మారారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో స్టార్ క్యాంపెయినర్‌‌గా ఉండి కూడా ఆయన వ్యతిరేక ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏఐసీసీ అగ్రనేతలు రాష్ట్రానికి వస్తుంటే.. ఆయన విదేశీ బాట పట్టారు. కీలకమైన పదవిలో ఉన్న ఆయన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం చేయకుండా ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడికి వెళ్లినా పార్టీపైనా విమర్శలు మానడం లేదు. మునుగోడు స్థానాన్ని దక్కించుకోవడం, జోడోయాత్రను సక్సెస్ చేసే పనిలో కాంగ్రెస్ నేతలు ఉంటే.. ఇలాంటి సమయంలో వెంకటరెడ్డి పుండు మీద కారం చల్లినట్లుగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ నేతల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. దీంతో వెంకట్ రెడ్డి వ్యవహారంపై ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.

Tags:    

Similar News