అత్తింటి వేధింపులు.. 9 నెలలకే నవవధువు సూసైడ్
నవ వధువు సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
దిశ, కార్వాన్ : నవ వధువు సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న గల్లీలో మెస్కో స్కూల్ వద్ద నివసించే ఆఫ్రోజ్ (24)తో టోలిచౌకిలోని (నదీమ్ కాలనీ) ఆఫ్నాన్ మహమ్మద్ గౌస్ అబ్బాసి ( 21)కి 9 నెలల క్రితం వివాహం జరిగింది.
వివాహం జరిగిన రెండు నెలలకే ఉద్యోగం కోసం ఆఫ్రోజ్ ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. భర్త ఆస్ట్రేలియాలో ఉండడంతో తరచుగా తమ కూతురుని అత్తింటివారు వేధిస్తున్నారని మృతురాలి తల్లి తెలిపారు. అడిగినవన్నీ పెట్టి తమ కూతురికి వివాహం చేసినా కూడా సంవత్సరం తిరిగే లోపు అత్తింటి వారి వేధింపులు తాళలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి రోధిస్తూ తెలిపింది. కేసు నమోదు చేసుకున్న హుమాయ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.