BRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్!
మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను వేసవి సెలవుల (జూలై 31) తర్వాతకు వాయిదా వేసింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పును ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ సోమవారం ఈ పిటిషన్‌ను సోమవారం విచారించి స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. యధాతథ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇకపైన దీన్ని మిస్సెలేనియస్ పిటిషన్‌గా విచారిస్తామని బెంచ్ పేర్కొన్నది.
సీబీఐ దర్యాప్తుకు అప్పగిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చినందున దానిపై స్టే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే విజ్ఞప్తిచేశారు. తదుపరి విచారణ జరిగేంతవరకు స్టేటస్ కో (యథాతథ స్థితి) కొనసాగుతుందని పేర్కొనడంతో సీబీఐ చేతికి కేసు ఎఫ్ఐఆర్, ఇతర వివరాలు వెళ్ళాల్సిన అవసరం లేదని కూడా బెంచ్ అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు పరిధిలో విచారణ ఉన్నందున అది తేలేంతవరకూ తదుపరి దర్యాప్తును సీబీఐ చేపట్టరాదన్న అభిప్రాయాన్ని బెంచ్ వ్యక్తం చేసింది.