ఎదురుపడ్డ మోహన్ బాబు, మంచు మనోజ్.. ఒకేసారి ఇద్దరినీ పిలిచిన కలెక్టర్
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్(Rangareddy District Collectorate)లో మోహన్ బాబు(Mohan Babu), మంచు మనోజ్(Manchu Manoj) దర్శనమిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్(Rangareddy District Collectorate)లో మోహన్ బాబు(Mohan Babu), మంచు మనోజ్(Manchu Manoj) దర్శనమిచ్చారు. మోహన్ బాబు ఫిర్యాదుతో సోమవారం ఇద్దరిని అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ విచారణకు పిలిచారు. గత కొంతకాలంగా మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య వరుస వివాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇద్దరితో మాట్లాడేందుకు, విచారణ కోసం పిలిపించారు. కాగా, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసంలో ఉంటోన్న మనోజ్‌ను ఖాళీ చేయించాలని కలెక్టరేట్‌లో మోహన్ బాబు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తానుంటున్న ఇంట్లోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారని మోహన్ బాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ ఇద్దరికీ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే మోహన్‌బాబు వేసిన పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎదుట మంచు మనోజ్ విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.
తాజాగా ఇవాళ మోహన్‌బాబుతో పాటు మరోసారి మనోజ్ కలెక్టరేట్‌కు వచ్చారు. తన వద్దనున్న కొన్ని డాక్యుమెంట్లను మనోజ్ కలెక్టర్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. కాగా, గతకొన్ని రోజుల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఒకరిపై ఒకరు మనోజ్, మోహన్ బాబు ఇద్దరూ ఫిర్యాదులు చేసుకున్నారు. మంచు మనోజ్ నుంచి తనకు ముప్పు ఉందని మోహన్ బాబు, మంచు విష్ణు నుంచి తనకు ముప్పు ఉందని మనోజ్ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఎవరికి వారు తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. అంతేకాదు.. పలుమార్లు భౌతిక దాడులకు సైతం దిగారు. తాజాగా ఈ వివాదాన్ని కలెక్టర్ సానుకూలంగా పరిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. చాలారోజుల తర్వాత మోహన్ బాబు, మనోజ్ ఎదురుపడటం హాట్ టాపిక్‌గా మారింది.