రెండు స్థానాల్లోనే ‘మోడీ’ ఎఫెక్ట్.. గ్రేటర్‌లో ప్రభావం చూపని ప్రధాని మెగా రోడ్ షో..!

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అగ్రత్రయం మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతోపాటు పలువురు అగ్ర నాయకులు ప్రచారం నిర్వహించారు.

Update: 2023-12-05 04:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అగ్రత్రయం మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతోపాటు పలువురు అగ్ర నాయకులు ప్రచారం నిర్వహించారు. అయితే వారు ప్రచారం చేసిన పలు స్థానాల్లో బీజేపీ సత్తా చాటగా, మరికొన్ని చోట్ల ఓడిపోయింది. ప్రధాని మోడీ మొత్తం ఐదు రోజుల్లో ఎనిమిది సభలు, ఒక రోడ్ షో నిర్వహించారు. కాగా, మోడీ ప్రచారం చేసిన కామారెడ్డి, నిర్మల్ స్థానాల్లో కాషాయ పార్టీ గెలుపొందింది. నాలుగు సెగ్మెంట్లలో ఓటమిపాలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రధాని రోడ్ షో ప్రభావం చూపలేకపోయింది. గ్రేటర్‌లో గతంలో మాదిరిగానే గోషామహల్ ఒక్కటంటే ఒక్కటే సీటు గెలుపొందింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 8 రోజుల్లో 16 సభలు, 6 రోడ్ షోలు చేపట్టారు.

కాగా, ఆయన ప్రచారం చేసిన ఆదిలాబాద్, ఆర్మూర్ సెగ్మెంట్లలో మాత్రమే కాషాయ పార్టీ గెలిచింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేపట్టిన ఒక్క స్థానంలోనూ బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రచారం చేపట్టిన సిర్పూర్, గోషామహల్‌లో బీజేపీ గెలిచింది. అస్సాం సీఎం హిమంత బిస్వశర్మ ప్రచారం చేసిన సిర్పూర్‌లో కాషాయ జెండా ఎగిరింది. రాజ్ నాథ్ సింగ్ ప్రచారం చేసిన ఆర్మూర్‌లో బీజేపీ గెలిచింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. కాగా, బీజేపీ అగ్ర నాయకత్వం ప్రధానంగా ఉత్తర తెలంగాణపైనే దృష్టి కేంద్రీకరించి ప్రచారం నిర్వహించినట్లు తెలుస్తున్నది.


Similar News