Ponnam Prabhakar: అదానీ దోపిడీ కుట్ర వెనుక మోడీ: పొన్నం
అదానీ దోపీడీకి ప్రధాని నరేంద్ర మోడీ పెద్దన్నగా వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్నం ఆరోపించారు.
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: అదానీ గ్రూప్ ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లేకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. అదానీ అప్రజాస్వామికంగా దేశ సంపదను కొల్లగొడుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆ అవినీతికి పెద్దన్నగా వ్యవహరిస్తున్నారని, అదానీ రూ.లక్షల కోట్లు దోపిడీ కుట్ర వెనుక పీఎం మోడీ ఉన్నారని ఆరోపించారు. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇవాళ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పొన్నం పాల్గొని మాట్లాడారు. అదానీ, అంబానీ బంధాన్ని, ఆనాడే రాహుల్ గాంధీ బయటపెట్టారన్నారని చెప్పారు. అదానీ అక్రమాల పై జేపీసి వేస్తే వచ్చే ఇబ్బంది ఏముందని ప్రశ్నించారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయని, అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే సీబీఐ, ఈడీతో దాడులు చేపిస్తున్నారని మన రాష్ట్రానికి చెందిన జీవీకే లాంటి సంస్థలను కూడా వేధించారని ఆరోపించారు.