Kavitha: నాటి తెలంగాణ తల్లి విగ్రహాలు గ్రామ గ్రామాన ప్రతిష్టిస్తాం.. ఎమ్మెల్సీ కవిత

సీఎం రేవంత్ రెడ్డి రూపొందించిన విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం చేస్తూ తీర్మానం చేసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) విమర్శించారు.

Update: 2024-12-14 10:39 GMT

దిశ, తెలంగాణ/ డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రూపొందించిన విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం చేస్తూ తీర్మానం చేసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) విమర్శించారు. ఇవాళ హైదరాబాద్‌లో తెలంగాణ అస్తిత్వంపై దాడి- చర్య అంటూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. (Telangana Thalli) తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారని ఆరోపించారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లుంటుందన్నారు. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుందని, అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ అని తెలిపారు.

అలాంటి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే తెలంగాణ సమాజంలో స్నేహశీలత, సుహృద్భావం ఎలా కనిపిస్తుంది ? అని ప్రశ్నించారు. మన అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదన్నారు. కానీ అటువంటి ప్రయత్నాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉనికి, సంస్కృతిపై దాడి జరుగుతుంటే మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదన్నారు. తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో రేవంత్ రెడ్డి ఎక్కడా లేరని ఫైర్ అయ్యారు. ఉద్యమ సమయంలో నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తామన్నారు. ఒక చేతిలో జొన్న కర్ర, మరొక చేతిలో బతుకమ్మ ధరించిన తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు, కవితలు రచించి పుస్తకాలు వెలువరిస్తామన్నారు. పిల్లలు వాడే నోట్ బుక్స్, రైటింగ్ ప్యాడ్స్ అన్నింటిపై తెలంగాణ తల్లిని ముద్రించి పిల్లలకు ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణ తల్లికి ఆరాధానతో కార్యక్రమం మొదలుపెట్టే సంప్రదాయాన్ని ఇకముందూ కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాలను గ్రామ గ్రామానా ప్రతిష్టించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. బతుకమ్మ అగ్రవర్ణాల పండుగ అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News