రాహుల్, సోనియాకు వెల్ కమ్.. హ్యాపీగా హైదరాబాద్ బిర్యానీ తిని వెళ్లిపోండి: కవిత సెటైర్

ఏడాదిన్నర కాలంగా నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ ఏమైందని ఎమ్మెల్సీ కవిత ఈడీని ప్రశ్నించారు. ఏడాది క్రితమే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పవన్ భన్సల్‌తో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన నాయకులను ఈడీ విచారించిందని ఆతర్వాత ఈ కేసును పక్కకు పెట్టారని ఆరోపించారు.

Update: 2023-09-15 16:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఏడాదిన్నర కాలంగా నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ ఏమైందని ఎమ్మెల్సీ కవిత ఈడీని ప్రశ్నించారు. ఏడాది క్రితమే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పవన్ భన్సల్‌తో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన నాయకులను ఈడీ విచారించిందని ఆతర్వాత ఈ కేసును పక్కకు పెట్టారని ఆరోపించారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్, బీజేపీకి మధ్య అవగాహన కుదిరినందున కాంగ్రెస్ నాయకులను ఈడీ విచారణకు పిలవడం లేదా అనే అనుమానం వ్యక్తం చేశారు.

రూ.5వేల కోట్ల మేర అవకతవకలు జరగాయన్న ఈ వ్యవహారంలో రాహుల్, సోనియా గాంధీపై ఉన్న కేసుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్‌కు మధ్య ఉన్న అవగాహన ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటూ మరో రాష్ట్రంలో కొట్లాట పెట్టుకుంటుందని, ఒక దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీతో కొట్లాడుతారు.. మరో దగ్గర ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని, ఇలా బహుళ రాష్ట్రాల్లో బహుళ విధానాలను కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తోందని నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో అదానీకి రెడ్ కార్పెట్ వేసి.. ఇతర రాష్ట్రాల్లోనేమో వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ఈ మోసపూరితమైన వైఖరి, ద్వంద్వ విధానాల గురించి ప్రజలకు అర్థమైందన్నారు. రాజకీయ టూరిస్టులను స్వాగతిస్తామని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి వస్తున్నా రాహుల్, సోనియా గాంధీకి స్వాగతం అంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాది బిర్యానీ తిని హ్యాపీగా వెళ్లిపోవాలని, కానీ ద్వంద్వ, మోసపూరిత వైఖరితో మరోసారి తెలంగాణ, దేశ ప్రజలను మధ్యపెట్టవద్దని సూచించారు.

20 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొంది 20 ఏళ్లు దాటిందని, లోక్ సభలో మాత్రం ఆమోదానికి నోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో ఈ బిల్లును పాస్ చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదన్నారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కూడా మహిళా బిల్లుపై కాంగ్రెస్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో చర్చించడానికి 9 అంశాలను ప్రతిపాదిస్తూ మోడీకి సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రస్తావించలేదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ చేర్చలేదని ధ్వజమెత్తారు. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడితే మద్దతు ఇస్తామని తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం చేసిందని గుర్తు చేశారు. మరోసారి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ తీర్మానం చేసిందని, సీఎం కేంద్రానికి లేఖ రాశారని అన్నారు. బిల్లు ఆమోదం కోసం పలు ఉద్యమాలు చేశానని, ఇతర పార్టీలతో కలిసి ఉద్యమాలు చేపట్టినట్లు తెలిపారు.

Tags:    

Similar News