MLA Sanjay : రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థుల మరణాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే : BRS ఎమ్మెల్యే సంజయ్

తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా మారిందని కోరుట్ల నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె. సంజయ్ అన్నారు .

Update: 2024-08-10 11:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా మారిందని కోరుట్ల నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె. సంజయ్ అన్నారు . శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి కె. సంజయ్ మాట్లాడుతూ.. 'కాంగ్రెస్‌ హయాంలో గత 7 నెలల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 36 మంది విద్యార్థులు చనిపోయారని , దాదాపు 500 మంది విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్‌తో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారని' అన్నారు. సీఎం రేవంత్ భాషలో చెప్పాలంటే ఈ మరణాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే అని సంజయ్ చెప్పారు.అలాగే తన సొంత నియోజకవర్గంలో ఆరుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని, వారిలో ఇద్దరు మరణించారని అన్నారు. శుక్రవారం పెద్దాపూర్ గ్రామంలో ఓ విద్యార్థి మృతి చెందాడని , రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

గత బీఆర్‌ఎస్ హయాంలో దాదాపు 1,200 వరకు గురుకులాలు ఏర్పాటు చేయబడ్డాయని, గతంలో వాటి పనితీరును అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తుండేవారని కానీ నేడు అలాంటి వ్యవస్థ పనిచేస్తున్నట్లు ఆధారాలు లేవని అన్నారు. విద్యార్థులకు సరిగా భోజనం పెట్టకపోవడం వల్ల వారు అనారోగ్యానికి గురవుతున్నారని, అలాగే హాస్టళ్లలో పాములు, ఎలుకలు ఉండడంతో విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితి కూడా బాగా లేదని సంజయ్‌ ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పలు చోట్ల ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల కొరత ఉండడంతో ప్రజలు ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ మండిపడ్డారు. 


Similar News