Ajmeera Rekha Nayak : కంట తడిపెట్టిన ఎమ్మెల్యే రేఖా నాయక్.. పార్టీ మార్పుపై కీ కామెంట్స్

బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ కాంగ్రెస్‌లో చేరుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

Update: 2023-09-14 14:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీలో వచ్చే ఎన్నికలకు టికెట్ రాలేదనే బాధతో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ కాంగ్రెస్‌లో చేరుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను పక్కన పెట్టినా తను మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని రేఖా నాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. 12 సంవత్సరాలు పార్టీ కోసం పని చేశానని, నేడు కూడా పని చేస్తానని అన్నారు. తాను ఇంకా పార్టీ మారలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని, పార్టీ మారింది తన భర్త శ్యాం నాయక్ అని, తాను కాదని స్పష్టం చేశారు.

కావాలనే తన అల్లుడిని బదిలీ చేశారని ఇవాళ ఆమె దస్తురాబాద్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు చేసిన అన్యాయం చాలదంటూ తన బిడ్డకు కూడా అన్యాయం చేశారని ఆమె కార్యకర్తల వద్ద బోరున విలపించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్‌లో ఉంటే.. అతని తండ్రి సీపీఐ పార్టీలో పని చేయడం లేదా.. అని నిలదీశారు. పార్టీ మారే ఉద్దేశం లేదని, బీఆర్ఎస్ పార్టీలోనే రెబల్ అభ్యర్థిగా ఉంటా అని ఎమ్మెల్యే రేఖా నాయక్ స్పష్టంచేశారు. 

Tags:    

Similar News