బెదిరింపు కాల్స్ చేసిన వారికి రాజాసింగ్ ట్విస్ట్.. ఏకంగా CM నెంబర్‌తో మస్కా
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అనంతరం ఈ కాల్స్‌పై రాజాసింగ్ మాట్లాడుతూ.. తన ఫోన్ చేసి బెదిరించడానికి ట్రై చేసిన వారికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇచ్చానని తెలిపారు. ‘నాకు ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయని బెదిరింపు కాల్స్ చేసిన వారు అడిగారు. ఇంకో నెంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చాను. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ ఇచ్చాను. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? లేదా? విచారణ ముందుకు సాగుతుందా? లేదా? ఇవాళ నాకు కంటిన్యూస్‌గా బెదిరింపు కాల్స్ వచ్చాయి.
ఫోన్ చేసిన వారు పాలస్తీనాకు చెందిన వారిగా తెలుస్తోంది. ధర్మం కోసం నువ్ పనిచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయి. అప్పుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉన్నాడు.. ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారో లేదో అని సీఎం నెంబర్ ఇచ్చాను. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్ వస్తే ఎలాగూ పట్టించుకోలేదు. అందుకే ముఖ్యమంత్రి నెంబర్‌కు బెదిరింపు కాల్ వస్తే అయినా చర్యలు తీసుకుంటారా? లేదా? విచారణ సాగుతుందా? లేదా? అనేది చూద్దాం.. నాకు ఈ కాల్స్ రావడం ఎప్పుడు బంద్ అవుతాయో చూద్దాం’ అని రాజాసింగ్ అన్నారు.