శాంతిభద్రతల పర్యవేక్షణలో రేవంత్ సర్కార్ ఫెయిల్: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఫైర్

రాష్ట్రంలో బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ల నుంచి రూ.వందల కోట్ల కమీషన్లు తీసుకుంటున్నారని, కానీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు

Update: 2024-07-12 16:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ల నుంచి రూ.వందల కోట్ల కమీషన్లు తీసుకుంటున్నారని, కానీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించడంపై మాత్రం రేవంత్ సర్కార్ ఇవ్వడంలేదని, కనీసం ఆలోచన కూడా చేయడంలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. శంషాబాద్‌లోని ఒక కన్వెన్షన్‌లో శుక్రవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సర్పంచ్‌లు గ్రామపంచాయతీల అభివృద్ధికి చేపట్టిన పనులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో వారంతా అప్పులపాలయ్యారని, రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడిన దాదాపు రూ.1200 కోట్లను చెల్లించడంలేదని ఆయన విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రోజుకో మాట చెబుతున్నారని చురకలంటించారు. ప్రభుత్వం రుణమాఫీ చెల్లించకపోవడంతో రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడి వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతున్నా రైతు భరోసా ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ఏలేటి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామపంచాయతీలకు గ్రహణం పట్టిందని చురకలంటించారు. ధరణి ప్రక్షాళన చేస్తామని, జరిగిన అక్రమాలపై ఎంక్వైరీ చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సీబీఐ ఎంక్వైరీ జరపాలని, అన్ని ఆధారాలతో సహా నిరూపించకుంటే రాజకీయ సన్యాసం చేస్తానంటూ చాలెంజ్ చేశారని, మరి ఇప్పుడెందుకు సీబీఐ విచారణకు ఇవ్వడంలేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్‌తో వ్యక్తి స్వేచ్ఛను ఉల్లంఘించిన వ్యక్తులను దోషులుగా గుర్తించాల్సిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.


Similar News