బీసీ డిక్లరేషన్ పేరిట బీజేపీ నాటకం.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్
బీసీ డిక్లరేషన్ పేరిట బీజేపీ కొత్త నాటకానికి తెరలేపిందని ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ మండిపడ్డారు.
దిశ, తెలంగాణ బ్యూరో : బీసీ డిక్లరేషన్ పేరిట బీజేపీ కొత్త నాటకానికి తెరలేపిందని ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ మండిపడ్డారు. బీజేపీ డిక్లరేషన్ చిత్తుకాగితంతో సమానమన్నారు. బీసీలపట్ల ఆపార్టీ మొసలి కన్నీరుకారుస్తోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు లక్ష రూపాయల చొప్పున చేయూత నందించే పథకం పై హార్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ... బీసీ లకు ఏం చేయలేకపోయిందని... బీసీ పీఎంగా మోడీ ఉన్నా చేయలేనిది.. తెలంగాణలో సీఎం అయిచేస్తారా అని మండిపడ్డారు. మోడీ ఓబీసీ వర్గాలకు చెందిన వ్యక్తి అని చెప్పుకుంటారని.. బీసీలకు ఏదైనా పథకం తెచ్చారా అని ప్రశ్నించారు. కనీసం బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయని మోడీ బీసీలను ఎలా ఉద్దరిస్తారన్నారు. కేవలం ఎన్నికలు ఉన్నాయనే బీసీ డిక్లరేషన్ డ్రామాలు అని, కేంద్ర ప్రభుత్వం బీసీ గణన ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు.
కేంద్రం కన్నా బీసీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ నిధులను ఖర్చు చేస్తోందని మండిపడ్డారు. అన్నీ బీసీ కులాలకు అండగా నిలుస్తూ కేసీఆర్ అభినవ జ్యోతి రావ్ ఫూలే గా మారారన్నారు. తెలంగాణలో బీసీల కోసం అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీ గణన ప్రారంభించి బీజేపీ నేతలు ఇక్కడ మాట్లాడాలన్నారు. కర్నాటకలో బీజేపీ మత రాజకీయాలు చేసి విఫలమైందని... అందుకే కులాల కార్డు ను ప్రయోగించాలని చూస్తోందని ఆరోపించారు. ఎన్ని రకాల డిక్లరేషన్ లు ప్రకటించినా బీజేపీని బీసీ లు నమ్మే పరిస్థితి లేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం సిద్ధరామయ్య గొప్పతనం.. పార్టీ ది కాదన్నారు. తెలంగాణలో సిద్ధ రామయ్యలు లేరు.. గాంధీ భవన్ లో గాడ్సే లు ఉన్నారన్నారు. తెలంగాణ లో బీజేపీకి అధికారం కలేనన్నారు. బీజేపీ ఎన్ని ట్రిక్కులు వేసినా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.