లోక్ సభ ఎన్నికల్లో BRS, బీజేపీలను సమాధి చేయాలి: ఎమ్మెల్యే కూనంనేని ఫైర్

లోక్ సభ ఎన్నికల్లో దేశాన్ని దోచుకున్న బీజేపీని, రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ పార్టీలను సమాధి చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర

Update: 2024-04-28 13:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో దేశాన్ని దోచుకున్న బీజేపీని, రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ పార్టీలను సమాధి చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు పిలుపునిచ్చారు. ఆదివారం నిర్వహించిన సీపీఐ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం ముఖ్యకార్యకర్తల సమావేశంలో కూనంనేని పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ బీజేపీ తన సమాధిని తానే తవ్వుకుంటుందని అన్నారు. భారతదేశ ఎన్నికలను హిందూ-ముస్లిం యుద్ధంగా మార్చాలని ప్రధాని మోదీ భావించి, విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. మతం పేరుతో ఓట్లు అడిగే బీజేపీని, అవినీతి బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఓడించి తరిమికొట్టాలని, 'ఇండియా కూటమి' బలపరచిన మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి విజయానికి సీపీఐ శ్రేణులు గట్టిగా కృషి చేయాలని కోరారు.

బీజేపీ, బీఆర్ఎస్‌లు ఎన్నికల పోరులో ఒకరిపై ఒకరు పోరాడుతున్నారని, వాస్తవానికి వారు కలిసి పనిచేస్తు ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగం, అధిక ధరలు, రైతుల కష్టాలపై ప్రధాని మోదీ స్పందించడని, ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అతి ముఖ్యమైన సమస్యలపై చర్చించడానికి కూడా మోదీ ఇష్టపడడని, అధికారం చేజిక్కించుకోవడం కోసం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయడం, ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టడం, దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టడం చేస్తుంటాడని అయన మండిపడ్డారు.

అంబేడ్కర్ అందించిన రాజ్యాంగంలో సామాజిక ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవలసిన తక్షణ అవసరముందని, త్వరలో జరుగునున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్‌లను చిత్తుగా ఓడించి, రాజ్యాంగాన్ని రక్షిస్తామని హామీ ఇస్తున్న 'ఇండియా కూటమి' అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ హామీలకు జవాబుదారీతనం లేదని, దేశ ప్రజలు బీజేపీని విశ్వశించడంలేదని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఏమైందన్నారు .

50% లాభంతో రైతులకు కనీస మద్దతు ధర కల్పించారా అని ప్రశ్నించారు. ప్రతి పౌరుని ఖాతాలో రూ.15 లక్షలు ఎందుకు వేయలేదన్నారు. 2022 నాటికి 100 స్మార్ట్ సిటీలు, బుల్లెట్ రైళ్లు, గంగా నది ప్రక్షాళన, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏమైయ్యాయని ఆయన ప్రశ్నించారు. దేశంలో మైనారిటీలు, మహిళలు, దళితులు, ఆదివాసీలపై అఘాయిత్యాలు వేగంగా పెరుగుతున్నాయని, మొత్తం భారత దేశ సమాజం బీజేపీ పాలనలో సురక్షితంగా లేదని ఫైర్ అయ్యారు. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే మోదీ ఫూర్తిస్థాయి నియంతలా మారి ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాలరాస్తాడని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఏది ఉండదని కేవలం నియంతృత్వ పాలనా కొనసాగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.


Similar News