బండి సంజయ్‌కు ఉన్న తెలివి రేవంత్‌కు లేదు: జగ్గారెడ్డి
తాను ఏ పార్టీలోకి వెళ్లనని, అవసరమైతే సొంత పార్టీ పెడుతానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తాను ఏ పార్టీలోకి వెళ్లనని, అవసరమైతే సొంత పార్టీ పెడుతానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సహజమేనని, ఈ పార్టీ జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డిల జాగీరు కాదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్ చెప్పితే తాను ఎందుకు మాట్లాడుతానని, తానేం చిన్న పిల్లాడిని కాదన్నారు. అయితే, టీపీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్ రెడ్డిని దించేసి ఆ కుర్చీలో కూర్చోవాలనే ఆలోచన ఎవరికీ లేదని, కానీ, ఎవరితో చెప్పకుండా రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అసలు రేవంత్ ఎందుకు తొందరపడుతున్నారో తెలియడం లేదన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఎలా వచ్చిందో అందరికీ తెలుసని, తాను రేవంత్‌ను ఇబ్బంది పెడుతున్నాననే ప్రచారం కరెక్ట్ కాదని జగ్గారెడ్డి అన్నారు. బండి సంజయ్‌కి ఉన్న రాజకీయ తెలివి రేవంత్‌కి లేదని, సొంత పార్టీ నేతలను బద్నాం చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని, ఎన్నికల ముందు అడ్డమైన పంచాయతీలు పెట్టుకున్నారని తెలిపారు.
అసమ్మతి సహజం
కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఉండటం సహజమేనని, ఏండ్ల నుంచి అది కొనసాగుతుందని, అన్ని పార్టీల్లోనూ అసమ్మతి ఉంటుందన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం తనకు అలవాటేనన్నారు. కొందరు అసమ్మతి పదాన్ని కోవర్టులుగా మార్చేశారని, అలాంటి వారు మూర్ఖులని, తాను మాత్రం ముందు నుంచీ పీసీసీ పదవి అడుగుతున్నానని, ఆ పదవి వచ్చేంత వరకు అడుగుతూనే ఉంటానని, రాజకీయాల్లో కుర్చీ అడుగడం, ప్రయత్నాలు చేయడం సహజమేనన్నారు. పార్టీలోని కొన్ని విషయాలపై చాలా మాట్లాడాలనుకున్నానని, కానీ, తానొక్కడినే మీదేసుకోవడం కరెక్ట్కాదనిపిస్తుందని జగ్గారెడ్డి అన్నారు. ఎవరికైనా కుర్చీ కోసం ఆశ ఉంటుందని, మోడీ ఎప్పుడు దిగిపోతాడో అని, రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని అనుకోవడం తెలిసిందేనన్నారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌ని దించండి అని ఎవరు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికలు పూర్తయిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. రేవంత్‌కు సీనియర్లం సహకరించడం లేదంటూ ఆయన ఫెయిల్ అయినట్టేనని, కాంగ్రెస్ పార్టీ ఒక్కరి జాగీరు కాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలు రేవంత్ నాయకత్వంలోనే నడిపిద్దామని, ఇప్పుడు రేవంత్‌ను దించే ఆలోచన అధిష్టానానికి తేలదని, పీసీసీ పోస్టులో ఎవరున్నా లాభనష్టాలు భరించాల్సిందేనన్నారు. కానీ, పీసీసీ చీఫ్‌గా సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం లేదని, సొంత నిర్ణయాలతో నష్టాలు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ పీఏసీ మీటింగ్‌కు అందరం హాజరయ్యామని, ఈ మీటింగ్‌లో ఏం అడిగినా రేవంత్ రెడ్డి చెప్పడం లేదని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇటీవల రేవంత్ రెడ్డి ఎందుకు టెంప్ట్ అవుతున్నాడో అర్థం కాలేదని, ఆయన్ను త్వరలోనే అడుగుతానని, సీనియర్ల సహకారం అంటే ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఏది చేసినా అంతా సైలెంట్ ఉంటే సరిపోతుందా అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే సహకరిస్తానని చెప్పారు.
భట్టి విక్రమార్క మంచి యాక్టర్
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంచి యాక్టర్ అని, ఆయన గురించి ఎవరికీ తెలియదని జగ్గారెడ్డి సెటైర్ వేశారు. జనరల్ ఎన్నికల తర్వాత ఈ విషయాలన్నింటిపైనా మాట్లాడుతానని, అప్పటి వరకు కాంగ్రెస్ వ్యవరాలపై నోరెత్తనన్నారు. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని ఉత్తమ్, భట్టి అడిగినా పీసీసీ చీఫ్‌దే నిర్ణయమని, రాష్ట్ర కాంగ్రెస్ కుటుంబానికి బాస్ రేవంత్ రెడ్డి అని, సొంత పార్టీని దెబ్బ కొట్టాలని మాకెందుకు ఉంటుందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, కర్ణాటకతో పాటుగా ఎన్నికలు వస్తాయన్నారు. బీజేపీ హైప్ డ్రామాలు ఓటు బ్యాంకును మార్చలేవన్నారు. కాగా, మెట్రో ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందని, దీన్ని సంగారెడ్డి వరకు పొడిగించాలని జగ్గారెడ్డి కోరారు. అసెంబ్లీలో సీఎంను అడుగుతానని, చాలా కంపెనీల ఉద్యోగులు సంగారెడ్డిలోనే ఎక్కువగా ఉన్నారని, అవసరమైతే యాదగిరి గుట్ట వరకు మెట్రోను పొడిగించాలని జగ్గారెడ్డి కోరారు.