పల్లె ప్రకృతి వనాల్లో ఆహ్లాదం మిస్!
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు నిరుపయోగంగా మారాయి.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు నిరుపయోగంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆహ్లాద పరచకపోగా, వాటి వల్ల ఉపయోగం లేకుండా పోయింది. దీంతో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు వృథాపోతున్నాయి. పల్లె ప్రకృతి వనాలను కొన్ని గ్రామాల్లో ఊరికి దూరంగా, కొన్నిచోట్ల కొండలు, గుట్టల మధ్య ఏర్పాటు చేశారు. దీంతో పల్లె ప్రకృతి వనాలకు వెళ్తే ఆహ్లాదం మాట పక్కన పెడితే ఆయాసం వచ్చే పరిస్థితి ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాక గొప్ప లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాల నిర్వహణ గ్రామ పంచాయతీలకు భారంగా మారిందని పలువురు వాపోతున్నారు.
వనాల్లో కలుపు తీయడంతో పాటు మొక్కల సంరక్షణ, నీటి నిర్వహణ వంటి పనులకు ప్రతి నెల రూ.5వేల నుంచి రూ.6వేల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో గ్రామాలకు చేరుకున్న విద్యార్థులు ఉదయం, సాయంత్రం వేళలో కాసేపు పల్లె ప్రకృతి వనంలో సేదతీరుదామని అనుకున్నా అక్కడి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఒక వేళ వెళ్లినా అక్కడ ఉండే పరిస్థితి లేదని పలువురు వాపోతున్నారు. ఆహ్లాదం పంచని పల్లె ప్రకృతి వనాలు ఎందుకు ఏర్పాటు చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో అభివృద్ది చేశామని చెప్పుకోవడానికి తప్పా ఏమి ప్రయోజనం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కల్పించుకుని గ్రామీణ ప్రజలకు ఆహ్లాదం అందే విధంగా ప్రకృతి వనాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
దిశ, కరీంనగర్ బ్యూరో : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆహ్లాదం పంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో మూడేళ్ల కింద పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి గ్రామంలో ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని ఇందుకోసం ప్రభుత్వ భూములను గుర్తించి ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో పలు గ్రామాల్లో భూములను గుర్తించి పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. భూమి అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి గ్రామాల్లో ఎకరం నుంచి మొదలుకొని 10ఎకరాల వరకు స్థలంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు.
పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం పంచాయతీ నిధులతోపాటు ఉపాధిహామీ పథకాన్ని వినియోగించుకున్నారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటడానికి కావాల్సిన గుంతలు తీయడానికి, నాటిన మొక్కల నిర్వహణ కోసం ఉపాధిహామీ పథకంలో పనులు చేపట్టారు. నేల చదును చేయడం, అవసరం ఉన్నచోట మట్టి పోయడం, పంచాయతీ నర్సరీలో ఉన్న మొక్కలు కాకుండ ఆహ్లాదం పంచడానికి కావాల్సిన మొక్కల కొనుగోలుకు పంచాయతీల నిధులు కేటాయించారు. ఒక్క పల్లె ప్రకృతి వనం నిర్మాణం కోసం రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఖర్చు చేశారు.
పంచాయతీలకు భారంగా..
గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల నిర్వహణ గ్రామ పంచాయతీలకు భారంగా మారింది. మూడేళ్ల కింద నిర్మాణ సమయంలో రెండేళ్లపాటు ఉపాధిహామీ కూలీలతో నిర్వహణ చేపట్టారు. ప్రస్తుతం ఉపాధిహామీ నుంచి నిధులు కేటాయించకపోవడంతో పల్లె ప్రకృతి వనాల నిర్వహణ పంచాయతీలకు భారంగా మారింది. పల్లె ప్రకృతి వనంలో కలుపు తీయడంతోపాటు మొక్కల సంరక్షణ, నీటి నిర్వహణ వంటి పనులకు ప్రతి నెల రూ.5వేల నుంచి రూ.6వేల వరకు ఖర్చు అవుతుంది. పల్లె ప్రకృతి వనాల నిర్వహణకు ప్రభుత్వం ఎటువంటి నిధులు కేటాయించకపోవడంతో పంచాయతీ నిధులతో నిర్వహణ చేపట్టడం గ్రామాలకు భారంగా మారింది.
ఆహ్లాదం పంచని వనాలు..
ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లో ఎక్కడ ఆహ్లాదం పంచడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలను కొన్నిచోట్ల గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయడంతో పల్లె ప్రకృతి వనాలకు చేరుకోవాలంటే ఆహ్లాదం మాట పక్కన పెడితే ఆయాసం వచ్చే పరిస్థితి ఉందని పలువురు వాపోతున్నారు. మరికొన్ని కొండలు, గుట్టల మధ్యలో ఏర్పాటు చేశారు. మరి కొన్ని చోట్ల చెరువులు, కొన్ని చోట్ల శ్మశానవాటికల పక్కన పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడంతో పల్లె ప్రజలు ఆహ్లాదం కోసం అక్కడికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.
ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో గ్రామాలకు చేరుకున్న విద్యార్థులు ఉదయం, సాయంత్రం వేళలో కాసేపు పల్లె ప్రకృతి వనంలో సేదతీరుదామని అనుకున్నా అక్కడి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఒక వేళ వెళ్లినా అక్కడ ఉండే పరిస్థితి లేదని పలువురు వాపోతున్నారు. ఆహ్లాదం పంచని పల్లె ప్రకృతి వనాలు ఎందుకు ఏర్పాటు చేసినట్లు అని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో ఒక అభివృద్ది కార్యక్రమం చేసినట్లు చెప్పుకోవడానికి తప్ప పల్లె ప్రకృతి వనాలు ఎక్కడా ఆహ్లాదం పంచినట్లు కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు కల్పించుకొని పల్లె ప్రజలకు ఆహ్లాదం అందే విధంగా ప్రకృతి వనాలను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.