మంత్రి VS అసంతృప్త నేతలు.. అధికార పార్టీలో భగ్గుమన్న విబేధాలు
ఉమ్మడి పాలమూరు జిల్లా అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాలు తమ దృష్టిని వనపర్తి వైపు సాగిస్తున్నాయి.
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లా అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాలు తమ దృష్టిని వనపర్తి వైపు సాగిస్తున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపై వనపర్తి జెడ్పీ చైర్మన్ లోక్ నాథరెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెగారెడ్డిలు అసంతృప్తిగా ఉన్నారు. తమ నేతలకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని వారి అనుచరగణం సామాజిక మాధ్యమాల్లో మంత్రిపై విమర్శలు గుప్పిస్తుండడం హట్ టాఫిక్‌గా మారింది. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్న ఆ ఇద్దరు నేతలపై పార్టీ అధిష్టానం వేటు వేస్తుందా? లేక మౌనంగా ఉండిపోతుందా?... అనేది వేచి చూడాలి.
వనపర్తి జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. మంత్రికి వ్యతిరేకంగా జెడ్పీ చైర్మన్ లోక్ నాథరెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెగారెడ్డిపై విమర్శలు చేస్తుండడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యక్రమాలకు సైతం వారు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య అధికారుల సమక్షంలోనే జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి తమ అధికారాలను కాలరాస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా నిధులను ఖర్చు చేస్తే ఎలా అని మంత్రి నిరంజన్ రెడ్డితో వాదించారు.
ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉండగా పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి సైతం మంత్రికి వ్యతిరేకి అనే ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన అధికార పార్టీ కార్యక్రమాలకు కూడా కొంత దూరంగా ఉంటున్నారు. మూడు రోజుల క్రితం మెగారెడ్డి అనుచరుడు మంత్రికి వ్యతిరేకంగా ఉన్న ఒక వీడియోను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడంతో పాటు థర్డ్ డిగ్రీ ఉపయోగించడంతో వనపర్తి జిల్లా అధికార పార్టీలో రసవత్తర చర్చలకు దారితీసింది.
ఆ వ్యక్తి చితకబాదిన నేపథ్యంలో ఎంపీపీ మెగా రెడ్డి, పలువురు సర్పంచులు, బీసీ సంఘం నేత యుగంధర్ గౌడ్ తదితరులు పోలీసుల తీరుపై విమర్శలు చేయడంతో పాటు.. ఒక అడుగు ముందుకు వేసి మంత్రి నిరంజన్ రెడ్డి కారణమంటూ ఆరోపణలు చేశారు. మంత్రికి, పార్టీ నియమావళికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేస్తూ బీ ఆర్ఎస్ నేతలు సైతం తీర్మానాలు చేశారు. ఈ క్రమంలో మంత్రికి వ్యతిరేకంగా ముందుకు సాగుతున్న జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీపీ, ఆయా గ్రామాల సర్పంచులపైన చర్యలు ఉంటాయా... లేక మౌనంగా ఉండిపోతారా అన్న చర్చలు ప్రారంభం అయ్యాయి.
ఎంపీపీ మేఘారెడ్డి పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుండగా, జిల్లా పరిషత్ చైర్మన్ వ్యవహార శైలి మాత్రం బయటపడడం లేదు. వారు రాజీనామా చేయకుంటే అధికార పార్టీ అధిష్టానం వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందా.. లాభం చేకూరుతుందా అనే అంశంపై తర్జన భర్జనలు పడుతున్నట్లు సమాచారం. జిల్లాలో జరుగుతున్న పరిణామాలను జిల్లా కమిటీ ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీపీ మెగా రెడ్డి పార్టీకి రాజీనామా చేసి.. పరిస్థితులను బట్టి తన ఎంపీపీ పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.
Also Read..
అవినీతి ‘స్వామి’..బయట పడుతున్న బదిలీ అయిన కమిషనర్ లీలలు
బిగ్ న్యూస్: ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై KCR అనూహ్య నిర్ణయం.. 5 స్థానాలు వారికే..?!