డబుల్ ఇంజిన్ సర్కార్ను కర్ణాటక ప్రజలు తిరస్కరించారు.. మంత్రి ప్రశాంత్ రెడ్డి

కర్ణాటక ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ను తిరస్కరించి బీజేపీకి చెంప దెబ్బలాంటి తీర్పునిచ్చారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Update: 2023-05-13 16:26 GMT
డబుల్ ఇంజిన్ సర్కార్ను కర్ణాటక ప్రజలు తిరస్కరించారు.. మంత్రి ప్రశాంత్ రెడ్డి
  • whatsapp icon

దిశ , తెలంగాణ బ్యూరో : కర్ణాటక ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ ను తిరస్కరించి బీజేపీకి చెంప దెబ్బలాంటి తీర్పునిచ్చారని రోడ్లు భవనాలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ది మరిచి మతాలు, దేవుని పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల పట్ల వైషమ్యాలు రెచ్చగొట్టి, దేశ భద్రతనే గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అసమర్థ, అవినీతి పాలన వల్ల సిలిండర్ ధర, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు అరిగోస పడుతున్నారని తెలిపారు. యావత్ దేశ ప్రజలు బీజేపీ పట్ల విసుగు చెందారనేందుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు.

దేశ సంపద అంతా మోడీ దోస్త్ అదానీకి ధారాదత్తం చేస్తూ.. అక్రమంగా వచ్చిన సొమ్ముతో ప్రభుత్వాలను కూలుస్తూ నీచ రాజకీయాలకు ఒడిగట్టారని ధ్వజమెత్తారు. కర్ణాటక ప్రజలు ప్రభుత్వంపైన తీవ్ర వ్యతిరేకతతో ప్రత్యామ్నాయ పార్టీ అయిన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని అన్నారు. కర్ణాటకలో గెలుపు చూసి తెలంగాణలో ఏమో పొడుస్తామని ఇక్కడి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నాడని, అది వాపు చూసి బలుపు అనుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ఉన్నంతవరకు ఇక్కడ ఎవరికీ చోటులేదని, ఈ ప్రాంత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ,బీజేపీని తిరస్కరించారని అన్నారు. దమ్ముంటే తెలంగాణ పథకాలను మొదలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసి చూపాలని మంత్రి వేముల సవాల్ విసిరారు.

వివక్ష విద్వేషాలను పెంచి పోషిస్తే ప్రజలు సహించరు : ఆంథోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ .

దక్షిణ భారతం నుంచి బీజేపీని ప్రజలు తరిమేస్తున్నరనడానికి ఇది నిదర్శనమి, అందుకు కర్ణాటక నుంచి బాటలు పడ్డాయని ఆంథోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. విద్వేషాలను పెంచి పోషిస్తూ ప్రజలు సహించరని, విషయం బీజేపీకి అర్థం అయ్యేలా కర్ణాటక ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. కర్ణాటక ఫలితాలను చూసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న తీరును చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను కాఫీ కొట్టి కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో చేర్చిన విషయాన్ని గుర్తుంచు కోవాలని ఆయనన్నారు. కేసీఆర్ నాయకత్వం లోని బీఆర్ఎస్ మీదే తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు.

Tags:    

Similar News